మోంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

– సమిశ్రగూడెంలో నేలవాలిన వరిపొలాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు– ఎర్రకాలువ, తుఫాన్, వరద బాధితులకునాడు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
– చరిత్రలోనే తొలిసారి ఎర్రకాలువ రైతులతో పాటు అరటి రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అందించిన ఘనత మాదేనన్న శ్రీనివాస్‌నాయుడు
మోంథా తుఫాన్‌ ప్రభావంతో నిడదవోలు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో తుఫాన్‌తో నేలవాలిన వరిపొలాలను శ్రీనివాస్‌నాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లువేణుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, బుధవారం పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు వద్ద ఉన్న ఖరీఫ్‌ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు తుఫాన్, భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ఈసందర్భంగా జి.శ్రీనివాస్‌నాయుడు మాట్లాడుతూ..
–గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని సీజన్‌ ముందే అందించేవారన్నారు. ఏటా 13,500 చొప్పున నియోజకవర్గంలోని నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో 21,334 మంది రైతులకు రూ.115.20 కోట్లు రైతు భరోసా పథకం అందించామన్నారు. రైతు భరోసా పథకానికి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి సరిపెట్టుకుంది. ఆ తరువాత అదిగో.. ఇదిగో అంటూ పెట్టుబడి సాయం ఊసు మాత్రం ఎత్తలేదని విమర్శించారు. రెండేళ్లలో రూ.5 వేలు మాత్రమే కొంతమంది రైతులకు అందించిందన్నారు.
– నిడదవోలు మండలంలోని రావిమెట్ల, కంసాలిపాలెం, సింగవరం, తాళ్లపాలెం, తాడిమళ్ల, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో ఎర్రకాలువ ముంపుతో 2021 ఏడాదిలో రైతులంతా తీవ్రంగా నష్టపోవడంతో దీంతో చరిత్రలో మొదటిసారిగా నిడదవోలు మండలంలో 5,836 మంది రైతులకు రూ.18.26 కోట్లు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అందించామన్నారు. ఆకాల వర్షాలకు, గోదావరి వరదల ఉద్ధృతంగా నష్టపోయిన రైతులకు రూ.7.65 కోట్లు ప్రభుత్వ సాయం అందించి నాడు రైతులకు అండగా నిలిచామన్నారు.

– గోదావరి ఉద్ధృతితో పాటు తుఫాన్‌లతో అరటితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి నేను స్వయంగా వెళ్లి మాట్లాడటంతో నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల రైతులతో పాటు జిల్లా వ్యాప్తంగా రూ.27 కోట్లు అరటి రైతులకు నష్టపరిహారం అందించేందుకు నా వంతు కృషిచేశానని శ్రీనివాస్‌నాయుడు తెలిపారు. వైఎస్ఆర్సిపి నాయకులు గజ్జరపు శ్రీ రమేష్, కస్తూరి సాగర్, కొత్తపల్లి సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link