రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం – మంత్రి కందుల దుర్గేష్
కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల వ్యయంతో ఎంజిఎన్ఆర్ఈజిఎస్, మండల పరిషత్ నిధుల ద్వారా మంజూరు చేయించిన బుర్రిలంక కాలువగట్టు నుండి ఏటి గట్టు వరకు సిమెంట్ రోడ్డును ప్రారంభించిన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
స్థానిక నర్సరీ రైతులకు, ఎస్సీ సొసైటీ భూములు గల రైతులకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపిన మంత్రి దుర్గేష్
స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో పాటు పర్యాటక శాఖ సహకారం, నాటి కలెక్టర్ పి. ప్రశాంతి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రోడ్డును నిర్మించగలిగామన్న మంత్రి దుర్గేష్
విపక్షం నిరాశ, నిస్పృహలో ఉందని, డేటా సెంటర్ విషయంలో అర్థం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డ మంత్రి కందుల దుర్గేష్
ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వక్రభాష్యం పలకడం సరైన విధానం కాదని విపక్ష నేతలకు సూచించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
గోదావరి పుష్కరాలు నాటికి కడియంను నో వర్క్ మండలంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజల హర్షిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల వ్యయంతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ మరియు మండల పరిషత్ నిధుల ద్వారా మంజూరు చేయించిన బుర్రిలంక కాలువగట్టు నుండి ఏటి గట్టు వరకు సిమెంట్ రోడ్డును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిలు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కాలువగట్టు నుండి ఏటి గట్టు వరకు సిమెంట్ రోడ్డును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో పాటు పర్యాటక శాఖ సహకారం, నాటి కలెక్టర్ పి.ప్రశాంతి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రోడ్డును నిర్మించగలిగామన్నారు. ఈ రోడ్డు స్థానిక నర్సరీ రైతులకు, ఎస్సీ సొసైటీ భూములు గల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేసిందన్నారు. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఆర్ఈజీఎస్, పంచాయితీ రాజ్ నిధులతో లింకు రోడ్లు, గ్రామీణ రోడ్లు నిర్మించుకోవడం నిరంతర ప్రక్రియగా జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయం పట్టించుకోలేదని మంత్రి దుర్గేష్ విమర్శించారు. కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టక పోగా కనీసం రహదారుల మరమ్మతులకు తట్టెడు మట్టి కూడా వేయని దుస్థితిని చూశామన్నారు. నాడు పెద్ద పెద్ద గోతులతో రహదారులు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని, ఒకానొక దశలో పడవల్లో ప్రయాణం చేసే పరిస్థితి నెలకొన్నదని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రోడ్లకు పెద్దపీట వేస్తూ ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీరాజ్, ఇతరత్రా నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు. తద్వారా అన్ని ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు.
గత ప్రభుత్వాధినేత, ఆయన పార్టీకి సంబంధించిన నేతలు నిరాశలో కూరుకుపోయి అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు. 12 దేశాలతో కనెక్టివిటీ చేయగలిగిన ప్రపంచ స్థాయి గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావని పేర్కొన్న గత ప్రభుత్వ అధినేత ఇప్పుడు తామే ఆ డేటా సెంటర్ ని ఏపీకి తీసుకువచ్చామని ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో చేపడతామన్నారు.
రాజమహేంద్రవరం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో రైతాంగానికి న్యాయం చేశామన్నారు. వేసవికాలం నాటికి పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మిస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాలు నాటికి కడియం ”నో వర్క్” మండలం గా తీర్చిదిద్దుతామన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ సమీకరించి అభివృద్ధి పనులు చేస్తామన్నారు.
కడియం లో నవోదయ పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కరెంటు కోతలు విధిస్తున్నామంటూ విపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, రైతన్నకి 9 గంటల కరెంటు, ఇళ్లకు 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తూ గడచిన ఐదేళ్ల అరాచక పాలనకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పాలిస్తుందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పుల పాలయిందని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ఏపీలో అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఇసుక, మద్యం, మైనింగ్ లో దోపిడీకి తెర తీసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. తనపై అపనిందలు వేసిన నాటి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఇష్టానుసారం మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నకిలీ మద్యాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వక్రభాష్యం పలకడం సరైన విధానం కాదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు.
కార్యక్రమంలో అధికారులు , కూటమి నాయకులు పాల్గొన్నారు.


