మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.70 కోట్ల నాబార్డు నిధుల సాయంతో జాతీయ రహదారి 16 నుండి కొత్తపల్లి అగ్రహారం మీదుగా కాపవరం పోవు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గంలో రూ.7.34 కోట్లతో 4 రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వానికి పెట్టిన ప్రతిపాదనలకు అనుమతులు లభించడం సంతోషంగా ఉందన్న మంత్రి దుర్గేష్.. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్ అండ్ బీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గంలో రూ.8 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
ఈ ఏడాది నుండి సన్నబియ్యంతో పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తామని ప్రకటన
నిడదవోలు: రూ.15 కోట్లతో త్వరలోనే నిడదవోలులో అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేపట్టి వాహనదారులకు కష్టాల నుండి విముక్తి కలిగిస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.70 కోట్ల నాబార్డు నిధుల సాయంతో జాతీయ రహదారి 16 నుండి కొత్తపల్లి అగ్రహారం మీదుగా కాపవరం పోవు రహదారి నిర్మాణానికి మంత్రి కందుల దుర్గేష్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో రూ.8 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని అదే విధంగా మరో 7.34 కోట్ల నాబార్డు నిధుల సాయంతో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రోడ్లు బాగుంటేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని విశ్వసించి ప్రస్తుతం శంకుస్థాపన చేసిన రహదారితో పాటు రూ.1.50 కోట్లతో కానూరు నుండి నడిపల్లి కోట, రూ.1.45 కోట్లతో సింగవరం నుండి నందమూరు, తాళ్లపాలెం మీదుగా నిడదవోలు మండలం వరకు, రూ.2.69 కోట్లతో ఉండ్రాజవరం మండలంలోని పైడిపర్రు నుండి సత్యవాడకు వెళ్లే రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్ అండ్ బి మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డిని కలిసి ప్రతిపాదనలు పెట్టానని ఈ మేరకు ఈ రోడ్లకు అనుమతులు మంజూరు కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. మూడు గ్రామాలను కలిపే ఈ రోడ్డును త్వరలోనే అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. తాను ప్రతిపాదనలు పెట్టిన 4 రహదారులకు ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, పరిపాలన అనుమతులతో పాటు ఆర్థిక అనుమతులు లభించాయని, కాంట్రాక్టర్లను లిస్ట్ చేశామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ 4 రోడ్లను త్వరితగతిన ప్రారంభించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నాబార్డు, రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సమీకరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
నిడదవోలు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి సైతం అనేక ప్రతిపాదనలు పెట్టానని మంత్రి దుర్గేష్ అన్నారు.నియోజకవర్గంలో నాడు ఎమ్మెల్యేగా ఉన్న బూరుగుపల్లి శేషారావు వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయని, గడిచిన ఐదేళ్లలో ఎలాంటి రోడ్లను చేపట్టలేదని మంత్రి దుర్గేష్ అన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వ హయాంలోనే రోడ్ల అభివృద్ధి జరుగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిడదవోలు నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని, వాహనదారులకు రహదారులు నరకానికి మార్గాలుగా మారాయన్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్లకు పరిష్కార మార్గం చూపిస్తున్నామన్నారు.
పెరవలి నుండి నిడదవోలు వెళ్లే రహదారిపై గుంతల పూడ్చివేత కార్యక్రమం చేపట్టినప్పటికీ కొంత డ్యామేజ్ జరిగిందని, మళ్లీ ఈ రహదారిని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టాలని ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ ను ఆదేశించానన్నారు. దీపావళి పండుగ అనంతరం వర్షాలు ముగిసిన వెంటనే రోడ్డు మరమ్మతు ప్రక్రియను చేపడతామని వారు తెలిపినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. ఇదే రహదారిలో మధ్యలో కొంత దూరం బాగోలేకపోతే రూ. కోటితో సిమెంట్ రోడ్డు వేయిస్తున్నామన్నారు
గతేడాది కన్నా ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో ఈ సీజన్ లో తొలుత 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపడతామని, అవసరమైతే 5.29 లక్షల ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. ధాన్యం సేకరణ అంశంపై పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు.


