కల్తీ బ్రాండ్లను మార్కెట్ లోకి తెచ్చిందే జగన్ మోహన్ రెడ్డి – మంత్రి కందుల దుర్గేష్

మద్యం విషయంలో విషప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు తమ విధానం మార్చుకోకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

నాడు కల్తీ మద్యానికి వైసీపీ నేతలు వత్తాసు పలికితే తాము ఉక్కుపాదం మోపుతున్నామన్న మంత్రి దుర్గేష్

నాడు కల్తీమద్యానికి ఆద్యులైన వారిని జగన్ మోహన్ రెడ్డి అందలం ఎక్కిస్తే తాము అలాంటి చర్యలకు పాల్పడ్డ వారిని సస్పెండ్ చేస్తున్నామని వెల్లడి

కూటమి ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా మద్యం విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్

ఎన్ ఫోర్స్ మెంట్ పనితీరుతోనే కల్తీ మద్యం పట్టుకున్నాం.. శవ రాజకీయాలు చేయడం అలవాటైన జగన్ కు ఆరోపణలు చేయడం తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదన్న మంత్రి దుర్గేష్

ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు ఖబడ్దార్ అని మంత్రి దుర్గేష్ హెచ్చరిక

నిడదవోలు: కూటమి ప్రభుత్వంలో మద్యం విధానం విషయంలో అత్యంత పారదర్శకంగా తాము పనిచేస్తుంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తమ నాయకులతో కలిసి బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి కందుల దుర్గేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు నకిలీ మద్యంపై నిడదవోలులో వినతిపత్రాలు ఇచ్చిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసులు నాయుడుపై మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ వైసీపీ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు.

మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి నాడు అధికారంలోకి వచ్చి చివరికి ప్రభుత్వమే లిక్కర్ అమ్మే పరిస్థితికి దిగజార్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కాదా అని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.నాడు ప్రభుత్వమే మద్యం అమ్మడం ఒకెత్తైతే సొంత బ్రాండ్లు, మద్యం వేలం పాటలు, తయారీ, అమ్మకాలు కూడా ప్రభుత్వం చేయడమేంటి ..ప్రభుత్వ వ్యవస్థను దిగజార్చిన జగన్ మోహన్ రెడ్డి నకిలీ మద్యానికి చిరునామ అన్నారు.

గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినప్పుడు వైసీపీ నేతలు నోరెందుకు మెదపలేదని మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం నడిపిన ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు కల్తీ మద్యానికి ఆద్యులైన వారిని జగన్ మోహన్ రెడ్డి అందలం ఎక్కిస్తుంటే అడ్డుకోకుండా ఏం చేశారని కోప్పడ్డారు. గత ఐదేళ్లు ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి నాశనం చేసినప్పుడు వీరంతా ఎక్కడున్నారని నిలదీశారు. గడిచిన ఐదేళ్లలో పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో మద్యం రేట్లు ఎక్కువ ఉన్న మాట వాస్తవం కాదా అని మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ మద్యం రవాణా ఏ రేంజ్ లో జరిగిందో ఆ పార్టీ నేతలకు తెలియదా అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్రమైన బ్రాండ్లను గత ప్రభుత్వం ప్రభుత్వ షాపుల్లో అమ్మిన మాట వాస్తవమా కాదా అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ షాపుల పేరిట ప్రభుత్వ ఖజానాను తమ నాయకులకు దోచిపెట్టారా లేదా అని ఆగ్రహించారు. రాష్ట్రంలోని మద్యం వ్యాపారాన్ని సిండికేట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతుండటం హాస్యాస్పదమన్నారు. సాధారణ మరణాలను కూడా వైసీపీ నేతలు కల్తీ మద్యంతో లింక్ చేయడం సిగ్గుచేటన్నారు. అందుకే తాము ఎవరు ఎక్కడ ఎలా చనిపోయినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయించి పోస్టుమార్టం చేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ పనితీరుతోనే కల్తీ మద్యం పట్టుకున్నామని, శవ రాజకీయాలు చేయడం అలవాటైన జగన్ కు, వైసీపీ నాయకులకు ఆరోపణలు చేయడం తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదని మంత్రి దుర్గేష్ అన్నారు.చివరికి టీచర్లను సైతం మద్యం షాపుల దగ్గర విధులు నిర్వర్తించేలా చేసిన వైసీపీ అధినేత ఆదేశాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే అని ఎద్దేవా చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నవోదయం 2.0 ద్వారా నాటు సారా పూర్తిగా నిర్మూలించామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. దాదాపు 21 జిల్లాలను సారా రహిత జిల్లాలుగా మార్చామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ప్రతి బాటిల్ ను 13 సార్లు పరీక్ష చేయిస్తున్నామన్నారు. అంతేగాక డిపోల నుండి మద్యం షాపులకు చేరిన తర్వాత కూడా పరీక్షిస్తున్నామని వెల్లడించారు. కల్తీ వ్యాపారంపై పూర్తి స్థాయి ట్రాకింగ్ విధానం అమలు చేస్తున్నామని, నిరంతరం నిఘా పెట్టామన్నారు. సేల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న కారణంగా నేడు కల్తీమద్యం స్కాం బయటిపడిందని అన్నారు.ప్రజల ప్రాణాలకు చేటు కల్గించే కల్తీ మద్యంపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. రాజకీయ ముసుగులో తప్పుడు పనులు చేసే వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గుర్తుచేశారు.తన మన అనే తేడా లేకుండా ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలువురికి పీటీ వారెంట్ ఇచ్చిందని, సస్పెండ్, అరెస్ట్ చేసిందని గుర్తుచేశారు.గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల వందలాది ప్రాణాలు పోయినప్పుడు, స్కాంలో వారి నేతలు దొరికినప్పుడు వైసీపీ నేతలు చేతులు కట్టుకొని కూర్చొన్నారా అని నిలదీశారు. తాము మద్యం రేట్లను తగ్గించడంతో పాటు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచామన్నారు. అదే విధంగా తాము అక్రమ రవాణా నిర్మూలించామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు ఖబడ్దార్ అని వైసీపీ నేతలను మంత్రి దుర్గేష్ హెచ్చరించారు.

Scroll to Top
Share via
Copy link