నియోజకవర్గంలో 1315 మందికి లబ్థి
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేయడం శుభపరిణామం అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకునే క్రమంలో వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రవేశ పెట్టిన పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు అభినందనలు తెలిపారు. ఈపథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ మేరకు తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో నిర్వహించనున్న అవగాహన సదస్సులను విజయవంతం చేయాలన్నారు. అత్తిలి మండలంలో 317, ఇరగవరం మండలంలో 401, తణుకు మండలంలో 254, తణుకు పట్టణంలో 343 మొత్తం 1315 మందికి లబ్థి చేకూరుతున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.


