అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా..సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో జరుగుతున్న 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

సామాజిక దృక్పథంతో తీసిన లఘుచిత్రాలను ప్రశంసించిన మంత్రి దుర్గేష్

పద్యనాటకానికి, నాటకానికి చావు లేదని పేర్కొన్న మంత్రి

నవంబర్ లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు. అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మంత్రి దుర్గేష్

గడిచిన ఐదేళ్లలో నీటి వనరుల శాఖ అంటే నోటిదురుసు, నోటి వనరుల శాఖగా మార్చారన్న మంత్రి దుర్గేష్

తాను మంత్రిగా ఉన్నానంటే అందుకు కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అని వెల్లడి

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి రావాల్సిన అవసరాన్ని, సినిమా పరిశ్రమ పరిణామక్రమాన్ని వివరించిన మంత్రి దుర్గేష్

పాలకొల్లు: ప్రతిభ కల కళాకారులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం సీనియర్ రాజకీయ నాయకులు హరిరామ జోగయ్య నేతృత్వంలో జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో జరుగుతున్న 4వ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందిన డైరెక్టర్ బి.గోపాల్, హాస్యభరిత చిత్రాలు నిర్మించిన దర్శకులు రేలంగి నరసింహరావును, అవార్డులు పొందిన పలువురిని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. లఘు చలన చిత్ర పోటీలు మంచి ప్రక్రియగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. సామాజిక దృక్పథంతో తీసిన లఘుచిత్రాలను మంత్రి దుర్గేష్ ప్రశంసించారు.జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ సృజనాత్మక కలిగిన వారిని ప్రోత్సహించడం గొప్ప విషయం అన్నారు. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఈ రంగంలో ఔత్సాహికులు మరింత మంది రావాల్సిన అవసరం ఉందన్నారు.నాటి తరం సినిమాలు, నేటి తరం సినిమాల నిర్మాణ విషయంలో సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ విజయం సాధిస్తున్న తీరును వివరించారు. క్షేత్రస్థాయి ప్రతిభను ఒడిసిపట్టుకొని విశ్వవ్యాప్తం చేయాలన్న నిర్వాహకుల ప్రయత్నానికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాటకానికి చావు లేదని ఘంటాపథంగా ఉద్ఘాటించారు. కురుక్షేత్ర నాటకం మాదిరి పద్యనాటకానికి అసలు చావే లేదన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కల్చరల్ అసోసియేషన్, కల్చరల్ ఆర్ట్స్ అని ఆంగ్లనామ ధ్యేయాలతో ఉండే పేర్లు కాకుండా స్వచ్ఛమైన తెలుగు పేరుతో ఉండే జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ పేరు వింటే మనసు పులకరిస్తుందని అన్నారు. తెలుగు భాషపై మక్కువ ఉన్న వ్యక్తిగా ఈ పేరును పెట్టినందుకు అభినందిస్తున్నానన్నారు. కళలకు కాణాచి రాజమహేంద్రవరం అని చెబుతూ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను, రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. నవంబర్ లో నంది నాటకోత్సవాలను రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నామన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ ను ఏపీకి ఇవ్వాలని కోరానన్నారు. ఇందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అతి అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను తీసుకొచ్చి తీరుతామని ఘంటాపథంగా తెలిపారు. తద్వారా నాటక రంగంలోని ఔత్సాహిక కళాకరులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి రావాల్సిన అవసరాన్ని, సినిమా పరిశ్రమ పరిణామక్రమాన్ని మంత్రి దుర్గేష్ వివరించారు. ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ పెట్టాలన్న హరిరామ జోగయ్య చిరకాల వాంఛను పరిగణలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించి నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు కావాల్సిన ప్రభుత్వ సహకారాన్ని అందించేందుకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చే ఆదాయంలో 60 శాతం ఏపీ నుండే వెళ్తుందన్నారు. 40 శాతం మాత్రమే తెలంగాణ నుండి వెళ్తుందని పేర్కొన్నారు. ఎక్కువ శాతం షూటింగ్ లు ఏపీలోనే జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే ఏపీకి సినిమా పరిశ్రమ తరలిరావాలన్నారు. రాబోయే రోజుల్లో పాలకొల్లు, రాజమహేంద్రవరంలో కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉందన్నారు.

క్షీరపురిగా ఉంటూ పాలకొల్లుగా మారిన ఈ ప్రాంతం నుండి అనేక మంది లబ్ద ప్రతిష్టులు, కళాకారులు వచ్చారని మంత్రి దుర్గేష్ అన్నారు. అద్భుత ప్రకృతి సౌందర్య ప్రాంతంగా ఉన్న గోదావరిలో వేలాదిగా సినిమా షూటింగ్ లు జరిగాయని తెలిపారు. ఎంతో మంది దర్శకులు గోదావరి పరివాహక ప్రాంతాన్ని సెల్యూలాయిడ్ మీదికి తీసుకువచ్చి మరింత ప్రాచుర్యం కల్పించడం ఆనందంగా ఉందన్నారు.

లఘు చిత్రాల్లో ప్రదర్శించిన కందుకూరి వీరేశలింగం రచించిన తెలుగు తొలి నవల రాజశేఖర చరిత్రను గురించి చెబుతూ ఆయన రాజమహేంద్రవరం వ్యక్తి అని మనవాడు, మావాడు అని పేర్కొన్నారు. రాజశేఖర చరిత్ర వంటి అద్భుత నాటక ప్రక్రియకి బీజం వేసిన వ్యక్తి గనుకే ప్రతి ఏటా ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఆయన పేరుతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడమే గాక అనేక మంది ప్రతిభ గల కళాకారులకు పురస్కారాలు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించిన మంత్రి నిమ్మల రామానాయుడును నిత్య కృషీవలుడు అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. గడిచిన ఐదేళ్లలో నీటి వనరుల శాఖ అంటే నోటిదురుసు, నోటి వనరులు అనే పరిస్థితి నుండి కచ్చితమైన నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించడంలో నిమ్మల అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్నారన్నారు. నిమ్మల రామానాయుడు సీనియర్ కళాకారులు, ప్రపంచం గర్వించదగ్గ ఎన్టీఆర్ పార్టీలో సభ్యులుఅయితే తాను నవతరం నాయకుడు, గొప్ప కళాకారులు పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీలో సభ్యుడిని అని చమత్కరించారు. తాను మంత్రిగా ఉన్నానంటే అందుకు కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అని అన్నారు.

ఈ సందర్భంగా పలువురిని తన మాటలతో, యాంకరింగ్ తో ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న సుజాత మంత్రి కందుల దుర్గేష్ ను స్టేజీ పైకి ఆహ్వానించే సందర్భంలో ఏ పని చేసినా జోష్ తో భేష్, శభాష్ అనిపించుకుంటున్నారని అన్న వ్యాఖ్యలు ఆహుతులచేత ఈలలు వేయించాయి.

Scroll to Top
Share via
Copy link