ఈ సమాజంలో మానవునికి నాగరికత నేర్పిన ఎంతో నైపుణ్యం కలిగిన వృత్తి టైలరింగ్ మాత్రమేనని వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు కొనియాడారు. వేల్పూరు టైలర్స్ వర్కర్స్ సంఘం సమావేశం అధ్యక్షులు మల్లేశ్వరపు నాగరాజు అధ్యక్షతన స్థానిక పార్వతిదేవి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో యువతపై రెడీమేడ్ దుస్తులు ప్రభావం ఎక్కువగా ఉన్నదని దీంతో ఏళ్ల తరబడి టైలరింగ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో అనేక కష్టాలు పడుతున్నా టైలర్స్ కోసం ప్రపంచంలో బంగ్లాదేశ్ వంటి దేశాలతో పాటు అనేక దేశాలకు చెందిన ప్రభుత్వాలే రెడీమేడ్ దుస్తులు తయారు చేసే గార్మెంట్స్ ఏర్పాటు చేసి టైలర్స్ కు ఉపాధి కల్పిస్తున్నాయని వీరభద్రరావు తెలిపారు. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి టైలర్స్ కు ఉపాధి కల్పించేందుకు గార్మెంట్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వృత్తిదారులకు ఆదరణ పథకం అమలు చేసి ఆధునిక పనిముట్లు అందిస్తామని ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆదరణ-3 పథకం ద్వారా టైలర్స్ కి అవసరమైన అధునాతన (జుక్కి) వంటి కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి టైలర్స్ కి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసా వెంకటేశ్వర్రావు, తాడిశెట్టి కోటి వెంకటేశ్వరరావు, ఆనందం గణేష్, రుద్రాక్షల శ్రీనివాసు, కరేళ్ల రాంబాబు, పోలవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


