నిడదవోలు జూనియర్ కాలేజీ, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బంధం బలోపేతానికి ప్రభుత్వ కృషి
ఇంటర్మీడియట్ లో మెరుగైన ఉత్తీర్ణత శాతం కనబర్చినందుకు యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి దుర్గేష్
యువత చెడు వ్యసనాల వైపు వెళ్లొద్దని సూచన..బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించిన మంత్రి దుర్గేష్
విద్యార్థులు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ
నిడదవోలు: పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక కీలక వేదికగా పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం నిడదవోలు జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. విద్యార్థుల అభ్యాస ప్రగతిని తల్లిదండ్రులకు చేరవేసేలా, అవగాహన పెంచేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని ఈ సందర్భంగా వివరిస్తూ చెడు వ్యసనాల వైపు యువత వెళ్లొద్దని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చాలా బాగా జరుగుతుందని ప్రశంసించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ల ప్రత్యేకమైన ఆలోచనతో రూపొందిన కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా పురోగతి, ప్రవర్తన, నైపుణ్యాలు, సామాజిక సమస్యల గురించి అవగాహన చేసుకోవడానికి సహాయపడతాయని, అదే సమయంలో ఉపాధ్యాయులు పిల్లల ప్రయోజనం కోసం తల్లిదండ్రుల సహకారాన్ని కోరడానికి వీలు కల్పిస్తాయని వివరించారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం జరగాలంటే అందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చొరవ చూపాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల బాగోగులు, వారి ఆలోచన విధానం, పురోగతిని సమీక్షించుకుంటే వారు భావి భారత పౌరులుగా ఎదుగుతారన్నారు. పూర్తిగా పరిపక్వత లేని ఇంటర్మీడియట్ దశలో విద్యార్థుల పోకడలపై, ఆలోచన విధానంపై తల్లిదండ్రులతో పాటు లెక్చరర్లు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా విద్యార్థులు సరైన దారిలో వెళ్లేందుకు దోహదపడినట్లవుతుందన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ లో మెరుగైన ఉత్తీర్ణత శాతం కనబర్చిన నిడదవోలు జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థులను అభినందించారు.
అనంతరం నిడదవోలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు.తల్లిదండ్రులను, గురువులను నమస్కరించి పూజించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీట వేసిందని మాతృదేవోభవ! పితృదేవో భవ! ఆచార్య దేవోభవ! అని అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే!అని ఉదహరించారు. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు అని వెల్లడించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చిందని వివరించారు. విద్యార్థులు మంచి స్థాయికి ఎదగాలంటే అందరం బాధ్యత తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందించి సహపంక్తి భోజనం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతినారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవారావు, ప్రత్యేక అధికారి దుర్గేష్, కమిషనర్,ఎమ్మార్వో, మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ వజీరుద్దీన్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రమోద్, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేశ్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, వామపక్ష నేత జువ్వల రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల విద్య కమిటీలు, అధ్యాపకేతర బృందం, తదితరులు పాల్గొన్నారు.


