తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పిటిఎం 2.0)లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
నిడదవోలు నియోజకవర్గంలో పండుగలా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్..ఏటా రెండు పర్యాయాలు నిర్వహించాలని మంత్రి దుర్గేష్ ఆదేశం
తరగతిగదుల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలుండాలని మంత్రి సూచన
విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఉద్యమంగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపు
మంత్రి నారాలోకేష్ విద్యావ్యవస్థలో వినూత్న మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించిన మంత్రి దుర్గేష్
భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు వేద్దామని నినదించిన మంత్రి దుర్గేష్..విద్యారంగంలో నూతన వికాసానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని వెల్లడి
నిడదవోలు: విద్యార్థి సమగ్ర పురోగతిని పర్యవేక్షించడం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థికి మెరుగైన మద్దతు అందించేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని ఎంవీఎన్ జెపీహెచ్ స్కూల్ లో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పిటిఎం 2.0)లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని మెరుగుపరచడం, పిల్లల ప్రగతిపై చర్చించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరిగింది. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను మరింత బలపర్చే దిశగా చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తరగతిగదుల్లోనే నిర్మాణమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థికి ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకొని తద్వారా అవసరమైన ప్రోత్సాహం అందించాలంటే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయల పాత్ర చాలా కీలకమని చెబుతూ విద్యార్థుల వికాసానికి దోహదపడే మార్గాలను మంత్రి దుర్గేష్ వివరించారు. కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ 2.0ను అద్భుత కార్యక్రమంగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. గత ప్రభుత్వానికి భిన్నంగా మంత్రి నారాలోకేష్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు, నాణ్యమైన చదువుల కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. చిన్నారుల్లో విద్యతో పాటు ఇతర రంగాల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలన్న దృఢ సంకల్పంతో ఈ మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయ మీటింగ్ నిర్వహించడం గొప్ప పరిణామన్నారు. తద్వారా విద్యారంగంలో నూతన వికాసానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని తెలిపారు.
సమాజంలో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయని ఈ నేపథ్యంలో తమ జీవన పోరాటంలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ఆస్కారం ఉండదన్నారు. పిల్లల్ని బడికి పంపాం తమ బాధ్యత తీరిందని తల్లిదండ్రులు, పిల్లలకు సిలబస్ ప్రకారం పాఠాలు చెప్పామని ఉపాధ్యాయులు భావించకుండా వారి ఉన్నతికి పాటుపడే విధంగా వ్యవహరించాలన్నారు. పిల్లల బంగారు భవిష్యత్ ను తీర్చిదిద్దాలన్న సంకల్పం ఇంట్లో తల్లిదండ్రులకు, పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఉండాలన్నారు. పిల్లలు మంచి పౌరులుగా తయారవ్వాలంటే వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏటా కనీసం రెండు పర్యాయాలు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏ రకంగా పాఠాలు చెబుతున్నారు, పాఠాలను విద్యార్థులు ఏ రకంగా అధ్యయనం చేస్తున్నారు, ఏ రకంగా జీవితంలో అన్వయించుకుంటున్నారన్న అంశాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థి బాగోగులు, స్కూల్ నుండి వచ్చిన అనంతరం నేర్చుకున్న అంశాలు, మానసిక పరిణతి, ఆలోచన విధానాల్లో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలుండాలని వివరించారు. విద్యార్థుల ప్రగతి విషయంలో, విద్యార్థిని సంపూర్ణ పౌరుడిగా తీర్చిదిద్దడంలో ఒకరికొకరు తమ ఆలోచన విధానాలను పంచుకోవాలన్నాన్నారు. తమ ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఆలోచించి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లాంటి సరైన వేదికను ఏర్పాటు చేశారని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి పిల్లల బాగోగులను తెలపాలన్నారు. పాఠశాలకు కొనసాగింపుగా ఇంట్లో నేర్పాల్సిన విషయాలను వివరించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా సమాజంలో పెచ్చుమీరుతున్న విపరీత ధోరణుల నుండి విద్యార్థులను కాపాడగలుగుతామన్నారు. చిన్నారుల ఆలోచనలు ఇప్పుడిప్పుడే వికసిస్తుంటాయని, వాటిని సరైన దారిలో పెట్టి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమదేనని అన్నారు.
తల్లిదండ్రులు తమ దైనందిన జీవితంలో తమ పిల్లల బాగోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంతకం పెట్టే ముందు ఏ సబ్జెక్ట్ లో అయితే తమ పిల్లాడు బలహీనంగా ఉన్నాడో గుర్తించి ఆ సబ్జెక్ట్ టీచర్ తో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. ఆ సబ్జెక్ట్ లో విద్యార్థిని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించి, విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు.
పాఠశాల ముందున్న రోడ్డుపై త్వరితగతిన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్ జోన్ అని తెలిపే బోర్డులను ఏర్పాటుచేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. ఉండ్రాజవరం జెడ్పీ పాఠశాలలో పీజీటీ, ఇంగ్లీష్ , ఫిజిక్స్ తదితర బోధనా సిబ్బంది ఖాళీలున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇటీవలే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించిందన్నారు.త్వరలోనే ఖాళీలు భర్తీ అవుతాయని తెలిపారు. అటెండర్ పోస్టు ఖాళీ అంశాన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లి నియమించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పాఠశాలకు రంగులు వేసేందుకు సీఎస్ఆర్ ఫండ్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించి విద్యను మరింత ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15,000 ఆర్థికసాయం అందిస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు. గతంలో ఒక్కరికే మాత్రమే ఇచ్చేవారన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి తద్వారా చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించి ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేస్తోందన్నారు. రాజకీయ పార్టీల రంగులు, బొమ్మలు లేకుండా స్కూళ్లు పునః ప్రారంభమైన తొలి రోజు నుంచే విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పేరుతో కిట్లు పంపిణీ చేశామన్నారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకు యూనిఫామ్ లు, పుస్తకాలు కూటమి ప్రభుత్వం అందిస్తున్నారు. అలాంటి మహానుభావుడి పేరుతో యూనిఫామ్ లు, పాఠ్యపుస్తకాలు తదితర కిట్ అందించి వారి గొప్పతనాన్ని, ఆలోచన విధానాలను సమాజానికి తెలుపుతున్నామన్నారు. సమాజానికి సేవ చేసిన వ్యక్తుల పేర్లనే విద్యావ్యవస్థలోని పథకాలకు పెడుతున్నామే తప్ప గతంలోలా ఫ్యాక్షన్ లీడర్ల పేర్లు పెట్టలేదన్నారు. షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సాయం అందించామన్నారు. అంతేగాక ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు.
తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం పిల్లల బంగారు భవిష్యత్ కోసం ..బడి వైపు ఒక అడుగు వేద్దాం అన్న నినాదంతో మార్మోగింది. ఆద్యంతం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ తో చిన్నారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఫోటోలు దిగారు. విద్యార్థులు మంత్రి దుర్గేష్ తో సెల్పీలు దిగేందుకు ఆసక్తి చూపారు. అనంతరం పాఠశాల తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థి మిత్ర కిట్ ను, పాఠశాల ఆవరణాన్ని మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రి దుర్గేష్ కు ప్రతి ఒక్కరూ మొక్కలు బహుకరించారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు సమష్టిగా పాల్గొని డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమంగానే గాకుండా అంతర్జాతీయంగా వస్తున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న కార్యక్రమంగా భావించాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


