11 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాద్
రాత్రివేళ ఇళ్ళ ముందు పార్కింగ్ చేసి ఉంచిన మోటారు సైకిళ్లను అపహరించుకుపోతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను తణుకు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబందించిన వివరాలు సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాద్, తణుకు రూరల్ సీఐ బి.కృష్ణకుమార్‌లు తణుకు రూరల్ పోలీసు స్టేషన్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలోని జీడిమెట్ల, సూరారం, కూకట్‌పల్లి పోలీసు స్టేషన్లతోపాటు తణుకు రూరల్ పోలీసు స్టేషన్, పోడూరు, నిడదవోలు పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిని బైక్ చోరీల్లో మొత్తం 11 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని, హైదరాబాదు జీడిమెట్లకు చెందిన దాసరి మణిబాబు, తణుకు పాతవూరుకు చెందిన గుడాల లక్ష్మినారాయణ అలియాస్ లక్కీ, తణుకు మండలం కొమరవరం గ్రామానికి చెందిన బొంత రవితేజలు బృందంగా ఏర్పడి మోటారు సైకిళ్లను అపహరించుకుపోయేవారని అన్నారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో తణుకు రూరల్ పోలీసు స్టేషన్‌లో నమోదైన మూడు బైక్ చోరీ కేసుల్లో అనుమానాస్పదంగా ఉన్న లక్ష్మీనారాయణ, రవితేజలను అదుపులోకి తీసకుని విచారించగా మొత్తం వ్యవహారం బట్టబయలైంది. కేవలం ప్రీమియం వాహనాలైన బుల్లెట్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు, స్వాధీనం చేసుకున్న మోటారు సైకిళ్లు విలువ రూ. 13.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ విశ్వనాద్ తెలిపారు. ఇళ్ళ ముందు రాత్రి సమయాల్లో పార్కింగ్ చేసుకున్న వాహనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్, ఏఎస్సై పి.సంగీతరావు, హెడ్‌కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎస్‌కే అన్వర్, ఎం. శ్రీనివాస్, వి.మాధవరావు, ఎస్.భాస్కరాచారిలను డీఎస్పీ విశ్వనాద్, సీఐ కృష్ణకుమార్‌లు అభినందించారు.


