బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బస్టాండ్, తహాసిల్దార్ కార్యాలయం ప్రాంతాలను పింక్ టాయిలెట్లు నిర్మాణాలకు అవసరమైన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళల ప్రత్యేక అవసరాల కోసం ప్రభుత్వం సంకల్పించిందని, దీనిలో భాగంగా పింక్ టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీటిని రద్దీగా ఉన్న ప్రాంతాలలో నిర్మిస్తే మహిళల అవసరాలకు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. తొలుత బస్టాండ్ ఇన్ గేట్ కుడివైపు ప్రాంతాన్ని పరిశీలించారు, అనంతరం బస్టాండ్ ప్రాంతం అంతా పరిశీలించి డిపో మేనేజర్ కు తగు సూచనలు చేశారు. బస్టాండ్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే తల్లులు పిల్లలకు పాలిచ్చే గదిని కూడా శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ తో సమన్వయం చేసుకొని మహిళలకు ఉపయోగపడే పింక్ టాయిలెట్ నిర్మాణానికి సహకరించాలని డిపోమేనేజర్ కు తెలిపారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం ప్రాంగణం మొత్తాన్ని పరిశీలించి, కార్యాలయం లోపలికి వచ్చే దారిలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఎడమవైపున ఉన్న స్థలాన్ని పరిశీలించారు. పింక్ టాయిలెట్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.


