చిత్తశుద్ధి బాధ్యతతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం
భవిష్యత్తులోనూ ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది
తణుకు నియోజవర్గంలో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఇరగవరం మండలం అర్జునుడు పాలెం, అత్తిలి మండలం పాలూరు గ్రామాలతో పాటు తణుకు పట్టణంలోని 15వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్ రూ. 3 వేలు నుంచి రూ. 4వేలు వరకు చేశామన్నారు. వివిధ కేటగిరీల్లో దివ్యాంగ పెన్షన్లు రూ. 6 వేలు నుంచి రూ. 15 వేలు వరకు పెంచినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల పెన్షన్లు అందజేస్తుండగా తణుకు నియోజవర్గంలో సుమారు 30 వేలకు పైగా పెన్షన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలలో పెన్షన్ రద్దు చేసే దుస్థితి ఉండేదని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వ హయాంలో మూడు నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా కొనసాగించే విధానాన్ని చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేద కుటుంబంలో పెద్ద కొడుకుల వ్యవహరిస్తున్నారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బ్యాంకులకు వెళ్లి పెన్షన్లు తెచ్చుకోవాలని, పేటీఎం బ్యాచ్ తో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల పట్ల చిత్తశుద్ధితో, బాధ్యతతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో సైతం ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించే విధానం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


