అక్టోబర్ 6, 7 తేదీలలో భీమవరంలో ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు…

భీమవరం: అక్టోబర్ 6, 7 తేదీలలో భీమవరంలో నిర్వహించనున్న ఏఐటీయూసీ పశ్చిమగోదావరి జిల్లా 12వ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరం బుధవారం మార్కెట్‌లోని మున్సిపల్ వర్కర్స్ మస్టర్ పాయింట్ వద్ద మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశంలోనే తొలి కేంద్ర కార్మిక సంఘంగా ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ముంబైలో ఆవిర్భవించిందన్నారు. కార్మిక హక్కులు, కార్మిక చట్టాల సాధన కోసం ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా, కనీస వేతనాలు, నిర్ణీత పనిగంటలు, శ్రమకు తగిన వేతనం వంటి హక్కుల సాధనలో ఏఐటీయూసీ పోరాటాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
అక్టోబర్ 6, 7 తేదీలలో భీమవరంలో జరిగే జిల్లా మహాసభల్లో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు భీమారావు తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు కార్మికులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిలారి మల్లేశ్వరరావు, ఎస్. వెంకటరమణ, కె. నాగశివమణి, కె. వీరభద్రరావు, ఎం. సుబ్బారావు, జి. సంజనారాణి, పి. కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link