చిన్న కోతతోనే క్లిష్టమైన గుండె చికిత్సలు!
- ఛాతీ ఎముకను చీల్చాల్సిన పనిలేకుండానే అధునాతన శస్త్రచికిత్సలు
- రోబోటిక్ టెక్నాలజీతో తగ్గిన రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల ముప్పు
- ఆపరేషన్ తర్వాత వేగంగా కోలుకుని దైనందిన జీవితంలోకి రోగులు
- గుండెపోటు లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్న వైద్యులు
- తణుకు మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ వైద్య బృందం వెల్లడి
తణుకు , జూన్ 30 :
గుండె ఆపరేషన్ అంటేనే ఛాతీ ఎముకను పూర్తిగా తెరవడం, భారీగా రక్తస్రావం కావడం, నెలల తరబడి మంచానికే పరిమితం కావడం అనే పాత భయాలకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ చెక్ పెడుతోంది. సరికొత్త వైద్య సాంకేతికతను ఒడిసిపట్టుకుని, గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి అతి తక్కువ కోతతోనే అత్యంత సురక్షితమైన చికిత్సలు అందిస్తోంది. తణుకులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ కార్డియో వాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ సత్య శ్రీధర్ కాలే ఈ అధునాతన రోబోటిక్, మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ విధానాల గురించి పత్రికా ముఖంగా వెల్లడించారు.
సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆధునిక విధానాల ద్వారా కేవలం కొన్ని సెంటీమీటర్ల మేర మాత్రమే చిన్న గాటు పెట్టి అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్లను యశోద హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. అధునాతన రోబోటిక్ పరికరాల సహాయంతో గుండె కవాటాల సమస్యలు, రంధ్రాలు, కణితులు, బైపాస్ వంటి శస్త్రచికిత్సలను ఎంతో కచ్చితత్వంతో నిర్వహిస్తున్నారు. దీనివల్ల రోగికి నొప్పి, ఇన్ఫెక్షన్ల బెడద గణనీయంగా తగ్గడమే కాకుండా, ఆసుపత్రిలో గడపాల్సిన సమయం కూడా బాగా ఆదా అవుతోంది. ఆపరేషన్ జరిగిన అనతికాలంలోనే రోగులు తమ సాధారణ పనుల్లో నిమగ్నమవుతున్నారని, శరీరంపై పెద్ద మచ్చలు పడకపోవడం వల్ల మానసికంగా కూడా ఎంతో ధైర్యంగా ఉంటున్నారని వైద్యులు వివరించారు.
మారుతున్న జీవనశైలి కారణంగా యువతలో సైతం గుండె సంబంధిత వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయని, ఛాతీ నొప్పి, ఆయాసం, గుండెదడ, కాళ్ల వాపు వంటి లక్షణాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదని డాక్టర్ సత్య శ్రీధర్ కాలే హెచ్చరించారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే యశోద హాస్పిటల్స్ లో ఉన్న ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అనుభవజ్ఞులైన వైద్య బృందం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ బాల వీరభద్ర నల్లం, సీనియర్ ఎక్జిక్యూటివ్ ఏ. ప్రవీణ్ , తదితర మార్కెటింగ్ బృందం సభ్యులు పాల్గొన్నారు.



