మంగళవారం పాలంగి గ్రామం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నందు ఏఐ ఆధారిత ఎక్స్ రే పరీక్షల ఉచిత వైద్య శిబిరం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.బి.దుర్గా మహేశ్వరరావు ఆధ్వర్యంలో టీబి యూనిట్ సూపర్వైజర్ వి.ఆశాజ్యోతి నిర్వహించారు, టీబీ వ్యాధి పై జరిగిన అవగాహన సదస్సులో డా. దుర్గామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి టీ.బి. అభయాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం కోసం ప్రభుత్వం 100 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందని, దీనిలో భాగంగా పాలంగి హెచ్.డబ్ల్యూ.సి. సెంటర్ నందు ఈ క్యాంప్ ఏర్పాటు చేసి, పాలంగి, తాడిపర్రు, చివటం గ్రామాల్లో అనుమానిత టి.బి లక్షణాలు గల వ్యక్తులకు ఎక్స్ రే తీసి, పరీక్షించి, టి.బి. నిర్ధారణ అయితే వారికి 6 నెలల కాలంపాటు ఉచితంగా మందులు ఇస్తామని, వాటిని క్రమం తప్పకుండా వాడిన వారికి టి.బి. వ్యాధి పూర్తిగా నిర్ములించబడుతుందని తెలియచేసారు. టి.బి.సూపర్వైజర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ఉండ్రాజవరం మండలంలో ఏడు గ్రామాలు ఉండ్రాజవరం, పాలంగి, చివటం, తాడిపర్రు, వడ్లూరు, కాల్దారి, మోర్త గ్రామాలను
హైరిస్క్ విలేజెస్ గా గుర్తించి టీబి స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత ఏ ఐ టెక్నాలజీ ఎక్స్ రే పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు, ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో టి.బి. వ్యాధి నిర్ధారించడానికి అవసరమైన ఆర్. టి. పి. సి. ఆర్. మిషన్ అందుబాటులో ఉన్నదని కావున ఈ అవకాశం ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి పి. ఎన్.డి.ప్రసాద్ టీ.బి. వ్యాధిపై అవగాహన పోస్టర్ విడుదల చేశారు. ఉండ్రాజవరం మండలంలో ప్రతి గ్రామం క్షయ రహిత గ్రామాలగా మార్పు చెందుటకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ఎం.సుబ్రమణ్యం, ఎం. పి. హెచ్. ఎస్. ఏ. శ్రీరామ్ మూర్తి, ఫిమేల్ హెల్త్ సూపర్వైజర్ మేరీ రత్నకుమారి, ఎస్. టి. ఎల్. ఎస్. భీమరాజు, ఎం. ఎల్. హెచ్. పి. లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సహాయకులు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.



