భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలోని 139వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల (EFs) పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించినట్లు తహసీల్దార్ పి. ఎన్. డి. ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు ఫారాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన వివరాలు నమోదు చేసి, సంబంధిత పత్రాలతో బీఎల్వోలకు అందజేయాలని కోరారు. ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని తహసీల్దార్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.



