రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు – మాజీ మంత్రి కారుమూరి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి, మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పాలన సాగిస్తున్నారని విమర్శించారు.మహిళలకు అండగా ఉంటామని చెప్పి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అందిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తామని చెప్పి డీఎస్సీ నియామకాల విషయంలో అవకతవకలకు పాల్పడి లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేశారని అన్నారు.

రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేశారంటూ తప్పుడు ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఎద్దేవా చేశారు.ఎన్నికల ముందు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. “నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు” అంటూ హామీల వర్షం కురిపించి, వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.

చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు సూపర్ షాక్‌గా మారాయని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా విద్య, వైద్య రంగాలను వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో “దోచుకో.. దాచుకో.. పంచుకో” అనే విధానం కొనసాగుతోందని విమర్శించారు. నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం తణుకు నియోజకవర్గ పరిశీలకులు కొట్టు నాగు గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజల ఆశలను వమ్ము చేస్తోందని అన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఎస్ఈసీ సభ్యులు పెండ్ర వీరన్న మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రజల తరఫున పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పెద్దలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link