నిడదవోలు నియోజకవర్గ టాపర్ ‘అమరాపురి జెస్సిక’కు మంత్రి దుర్గేష్ ప్రత్యేక అభినందనలు
592 మార్కులతో సత్తా చాటిన జెస్సిక.. అత్యుత్తమ మార్కులు సాధించిన బేబీ షాలిని, చంద్రిక ప్రియలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్
విద్యార్థినులను శాలువాతో సత్కరించి, ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. నిడదవోలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను మంత్రి దుర్గేష్ శుక్రవారం ప్రత్యేకంగా కలిసి అభినందించారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, పదో తరగతిలో 592 మార్కులు సాధించి నియోజకవర్గ స్థాయిలో టాపర్గా నిలిచిన అమరాపురి జెస్సిక ప్రతిభను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా 583 మార్కులు సాధించిన సీసల బేబీ షాలిని, 573 మార్కులు తెచ్చుకున్న కణితి చంద్రిక ప్రియలను మంత్రి దుర్గేష్ శాలువాతో సత్కరించారు.అంతకుముందు జెడ్పీహెచ్ఎస్ శెట్టిపేటలో చదువుతున్న తాళ్ళపాలెంకు చెందిన భవన యమున అనే విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో 547 మార్కులు సాధించిన సందర్భంగా మంత్రి దుర్గేష్ అభినందించారు. భవిష్యత్తులో ఐఐటీ చదువుతానని కోరిన ఆ బాలికకు ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “ప్రణాళికాబద్ధమైన కృషి, పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించగలరని ఈ విద్యార్థినులు నిరూపించారు. పేదరికం చదువుకు అడ్డంకి కాదని చాటి చెప్పారు” అని పేర్కొన్నారు. విద్యార్థినుల వెనుక ఉన్న తల్లిదండ్రుల కృషిని, ఉపాధ్యాయుల బోధనా పటిమను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి కూడా తమ వద్దకు వచ్చి, స్వయంగా సన్మానించి, వెన్నుతట్టి ప్రోత్సహించడం పట్ల విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి దుర్గేష్ మాటలు తమలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.



