ఈనెల 18న నిడదవోలులో జరిగే ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్నారని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
ముఖ్యమంత్రి పర్యటనను దిగ్విజయం చేయాలని కూటమి నాయకులు, కార్యక్తరలు, ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
మాలకోడూరు చెరువు అభివృద్ధి, ఎస్టీపీ ప్లాంట్లపై కీలక ప్రకటనలకు అవకాశం ఉందన్న మంత్రి దుర్గేష్
కలెక్టర్, అధికార యంత్రాంగంతో కలిసి సభాప్రాంగణం, హెలిప్యాడ్, కార్యకర్తల సమావేశం కోసం స్థల పరిశీలన, ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కందుల దుర్గేష్
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక తొలిసారి నిడదవోలుకు సీఎం చంద్రబాబునాయుడు .. కూటమి కార్యకర్తల్లో మొదలైన ఉత్సాహం
నిడదవోలును ఎంపిక చేసుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ – సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి దుర్గేష్ పిలుపు
ముఖ్యమంత్రి పర్యటనతో నిడదవోలులో రాజకీయ సందడి – ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు
నిడదవోలు: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటనకు రానున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబునాయుడు చారిత్రాత్మక నిడదవోలు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా సీఎం నిడదవోలుకు విచ్చేస్తుండటంతో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మాలకోడూరు చెరువు, చినకాశీరేవు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం, మహిళా కళాశాల ప్రాంగణం, కరెంట్ ఆఫీస్ స్థలం, పంగిడి రోడ్డులోని బ్రాహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పర్యటించిన ప్రాంతాల్లో సంబంధిత ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణంలోని లయన్స్ హాస్పిటల్ సమీపంలోని మాలకోడూరు చెరువును, చినకాశీరేవు, ప్రజావేదిక కోసం ప్రస్తుతం ప్రెస్ మీట్ జరిగిన ప్రాంతం, కార్యకర్తల సమావేశం కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం, హెలిప్యాడ్ కోసం పంగిడి రోడ్డులోని బ్రాహ్మణ గూడెం ప్రాంతాలను పరిశీలించామన్నారు. అక్కడి నుండి సీఎం సభావేదికకు వచ్చి తిరిగి వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించామన్నారు. ఈ ప్రాంతాల ఎంపికపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ విషయంపై సీఎంవోతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. పూర్తిస్థాయి చర్చలు జరిగాక కార్యక్రమం షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. మే1 న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబునాయుడును విజ్ఞప్తి చేశానని, తుది నిర్ణయం వచ్చాక ఆ వివరాలు వెల్లడిస్తానన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ .. పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.5.5 కోట్లతో అభివృద్ధి చేయనున్న మాలకోడూరు చెరువును, చినకాశీరేవును పరిశీలించామని, వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సీఎం పర్యటన సందర్భంగా మాలకోడూరు చెరువు సుందరీకరణ, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత, నీటి సంరక్షణ, నీటి భద్రత తదితర అనేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నిడదవోలులో సైతం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.స్వచ్ఛత కోసం మనం ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రపంచమంతా తెలిసేందుకు వీలుంటుందన్నారు. ఈ క్రమంలో చారిత్రాత్మక నిడదవోలు పట్టణానికి సీఎం విచ్చేస్తుండటం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే, మే 1న జరిగే ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరానని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనకు వస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. సీఎం సభకు భారీ ఎత్తున జనం వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు క్రమశిక్షణతో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు మంత్రి దుర్గేష్ మరియు కలెక్టర్ కీర్తి చేకూరి చినకాశీరేవులోని వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఎ. దుర్గేష్, కమిషనర్ కృష్ణవేణి, పలువురు ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


