రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం.. 23 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లక్ష్యం

:- : మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్

రేపటి నుండే రబీ సీజన్ ధాన్యం సేకరణను ప్రారంభిస్తున్నామని వెల్లడి

రాష్ట్రవ్యాప్తంగా 1,917 సేకరణ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి..రైతుల కోసం 5.40 కోట్ల గన్ని బ్యాగులు, రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని ప్రకటన

రైతు ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ ..దళారులను నమ్మి మోసపోవద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు

గ్యాస్ సరఫరాలో సాధారణ స్థితి.. తగ్గుతున్న బ్యాక్‌లాగ్ బుకింగ్స్

నిడదవోలు ప్రాంత అభివృద్ధికి మంత్రి దుర్గేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడిన మంత్రి నాదెండ్ల మనోహర్

నిడదవోలు: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రబీ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ సంయుక్తంగా ప్రకటించారు. శుక్రవారం నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

ఖరీఫ్ విజయవంతం – రికార్డు స్థాయిలో సేకరణ:

ఖరీఫ్ సీజన్‌ను కూటమి ప్రభుత్వం అత్యంత విజయవంతంగా ముగించిందని మంత్రులు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వంటి ప్రాంతాల్లో సాగు ఆలస్యమైనప్పటికీ, అక్కడ రికార్డు స్థాయిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబోతున్నామని వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో రబీ సీజన్‌లోనూ అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుండే ధాన్యం సేకరణ ప్రారంభించబోతున్నామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పనిచేస్తున్నామన్నారు.

రైతు పక్షపాతి ప్రభుత్వం – గత గణాంకాలతో పోలిక

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022-23లో 14.12 లక్షలు, 2023-24లో కేవలం 12.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని.. కానీ కూటమి ప్రభుత్వం గత రబీలో 22 లక్షల లక్ష్యానికి గానూ 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. 2.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,575 కోట్లు కేవలం 48 గంటల్లోనే జమ చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఖరీఫ్ సీజన్ లో కూటమి ప్రభుత్వం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టి రూ.11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేవలం 24 గంటల్లోనే జమ చేశామని గుర్తుచేశారు.అందులో సుమారు రూ.7300 కోట్ల రూపాయలు కేవలం 8 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులు హర్షించడం తమకు సంతోషం కలిగించిందన్నారు.

రబీ సేకరణకు పక్కా ప్రణాళిక:

ఈ రబీలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,917 సేకరణ కేంద్రాలు ఈ వారంలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రైతుల కోసం 5.40 కోట్ల గన్ని బ్యాగులు, రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని ప్రకటించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కల్లాల వద్దే, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గోదాలు అందిస్తామన్నారు.24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2,411 రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని వివరించారు.

రైతులకు నూతన సౌకర్యాలు:

రైతులు తమకు ఇష్టమైన మూడు రైస్ మిల్లుల్లో ఏదో ఒకదానిని ఎంచుకునే వెసులుబాటు కల్పించామని, వాట్సప్ ద్వారా కూడా ఈ ఏర్పాట్లు చేసుకోవచ్చని మంత్రులు వివరించారు. మిల్లుల వద్ద రైతులు వేచి ఉండే అవసరం లేకుండా పర్యవేక్షణ ఉంటుందన్నారు. “రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే 48 గంటల్లో నగదు జమ చేస్తున్నాం. 98 శాతం మంది రైతులు ఈ విషయంలో సంతోషంగా ఉన్నారు” అని వారు తెలిపారు.

మిల్లర్లకు హెచ్చరిక – రైతులకు సూచన:

ధాన్యం తేమ శాతం విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లను ఉపేక్షించేది లేదని మంత్రులు హెచ్చరించారు. దళారుల బారిన పడి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన సేకరణ కేంద్రాలనే వినియోగించుకోవాలని కోరారు. రైతులకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు.

గ్యాస్ సరఫరాపై స్పష్టత:

రాష్ట్రంలో గ్యాస్ కొరత క్రమంగా తొలుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్చి రెండో వారంలో రోజుకు 5 లక్షల వరకు పెరిగిన బుకింగ్స్, ఏప్రిల్ 2 నాటికి 2.97 లక్షలకు తగ్గాయని వివరించారు. ఇప్పటికే 2,52,520 డెలివరీలు పూర్తి చేశామని, అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో ఈ వారంలో బ్యాక్‌లాగ్ మొత్తం క్లియర్ అవుతుందని స్పష్టం చేశారు.

మంత్రి దుర్గేష్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసల జల్లు

ధాన్యం కొనుగోలు, గ్యాస్ సరఫరా, నిత్యావసర వస్తువుల సరఫరాలో వినూత్న మార్పులు తీసుకొచ్చిన మంత్రిగా నాదెండ్ల మనోహర్ పేరు గడించారని మంత్రి దుర్గేష్ అన్నారు. నిడదవోలులో పత్రికా సమావేశం నిర్వహించి రైతాంగానికి సంబంధించిన అంశాలపై ప్రధానాంశాలు వివరించడం సంతోషకరమన్నారు. నిడదవోలు ప్రజానీకం తరపున సాదర స్వాగతం పలికారు. మంత్రి దుర్గేష్ తో తనకు రెండు దశాబ్దాల సాన్నిహిత్యం ఉందని, నిడదవోలు ప్రాంత అభివృద్ధికి మంత్రి దుర్గేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు. గతంలో ఇరువురం కలిసి అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. గతంలో మంత్రి దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేసి ప్రజల కోసం మంచి పనులు చేశారన్నారు. తాము అధికారంలో లేని సమయంలో కూడా నాటి ప్రభుత్వంపై రైతాంగ సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేశామని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రైతాంగానికి అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ, రైతే రాజు అన్న సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

అంతకుముందు నిడదవోలు విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు ప్రాంతీయ అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ కూటమి నాయకులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link