ప్రధానమంత్రి మోడీ సహకారంతో నూతన రైల్వే మార్గాలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
కేంద్రమంత్రి వర్మతో కలిసి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం
**కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రైలు మార్గాలను అభివృద్ధి చేసి అందుకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశేష కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కామాఖ్య – చర్లపల్లి మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఆదివారం తణుకులో ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్స్ ప్రెస్ రైలును జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ చర్లపల్లి- కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణ, ఏపీ నుండి అస్సాం వరకు నూతనంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రజా రవాణ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా అవసరాలను గుర్తించి కేంద్రం ద్వారా ప్రతిపాదనలు చేసి వాటిని ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సర్కార్ ఎక్స్ ప్రెస్, పూరి- తిరుపతి రైలు అత్తిలి హాల్టును పునరుద్ధరించడానికి మంత్రి శ్రీనివాస వర్మ చేసిన కృషిని అభినందించారు. నరసాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును తీసుకురావడం గర్వకారణం అని అన్నారు. జిల్లాలో రాబోయే రోజుల్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇక్కడి ప్రజా అవసరాలను దృష్ట్యా ప్రతిపాదనలు చేసి సాధించుకున్నారని అన్నారు గతంలోనూ అత్తిలి రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైలు హాల్టు కోసం ఆయన తన దృష్టికి ఎన్నో పర్యాయాలు తీసుకురావడంతో సాధించగలిగామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస వర్మ కు తణుకు రైల్వే స్టేషన్ లో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, రైల్వే అధికారులు హాజరయ్యారు.


