మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నిడదవోలు, ధవళేశ్వరంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన మంత్రి దుర్గేష్
100 శాతం స్ట్రైక్ రేట్‌తో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, జనసేనాని పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా సత్తా చాటారని వెల్లడి
నిడదవోలులో భారీగా జనసేనలో చేరికలు – కండువా వేసి ఆహ్వానించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు:జనసేన పార్టీ కేవలం అధికారం కోసం కాకుండా, సమాజంలో మార్పు కోసం, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఆవిర్భవించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తన చేతుల మీదుగా జనసేన జెండాను ఆవిష్కరించి, భారీ కేక్ ను కట్ చేసి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు తినిపించారు. అనంతరం జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినదించారు. వందలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరగా వారికి మంత్రి దుర్గేష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జీవన్ దాన్’ అవయవదాన అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ మూలాలను గుర్తుచేశారు. పార్టీ ప్రస్థానాన్ని వివరించారు.జనసేన పార్టీ ప్రజా సేవ కోసం పుట్టిందన్నారు.ప్రజల కంట కన్నీరు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో 2014 మార్చి 14న అంటే 12 ఏళ్ల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు.జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఏడు సిద్ధాంతాలు పార్టీకి దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల మధ్య వైషమ్యం లేని రాజకీయం, భాషా వైవిధ్యాన్ని గౌరవించే సంప్రదాయం, మన సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం , పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం .. ఇవే జనసేనకు పునాదులుగా అభివర్ణించారు.పార్టీ సభ్యత్వం ఉన్న జనసైనికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందించి అండగా నిలుస్తున్నామని తెలిపారు.ఎన్ని అవమానాలు ఎదురైనా, వ్యక్తిగత విమర్శలు వచ్చినా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పంథాను మార్చుకుండా 2024 ఎన్నికల్లో ఓట్లు చీలకుండా చూపిన వ్యూహచతురత వల్ల కూటమి విజయం సాధించిందని, పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించి జనసేన సత్తా చాటారని కొనియాడారు.అధికారం వచ్చినా గర్వపడకుండా సామాన్యులకు చేరువవ్వాలనే తపన జనసేనానిదన్నారు.ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను..బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చానన్న పవన్ కళ్యాణ్ మాటలు విశ్వసించి జనసేన సభ్యత్వం పొందాలని కోరారు..పారదర్శకతకు నిదర్శనం జనసేన పార్టీ చిహ్నం అన్నారు.
ధవళేశ్వరంలో వేడుకలు:
అంతకుముందు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని ధవళేశ్వరంలో జరిగిన వేడుకల్లో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. అక్కడ జనసైనికులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి, ప్రజలకు స్వయంగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. అడవి బిడ్డల సమస్యలు వినడం, వారితో సహపంక్తి భోజనం చేయడం వంటి చర్యలు పవన్ కళ్యాణ్ గారి సేవా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జనసైనికులను అభినందించారు. రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన పార్టీ సిద్ధాంతాలను స్మరించుకుంటూ అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పేదవాడి మొఖంలో చిరునవ్వుచూడటమే లక్ష్యంగా, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రమాణం చేశారు. ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని చెబుతూ బలమైన రాజకీయ వ్యవస్థ కోసం ప్రతి ఒక్కరూ జనసేనలో భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేశ్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


