పశువైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఈ నెల 16 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
పోస్టర్లు ఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
***రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకంలో భాగంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 20 వేలకు పైగా పశువులకు టీకాలు వేసే కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కూటమి కార్యాలయంలో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. నాలుగు నెలలు దాటిన పశువులకు టీకాలు ఇవ్వడం ద్వారా వాటిలో వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు పాల ఉత్పత్తి పెరిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో ఈనెల 16 నుంచి వచ్చే నెల 29 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పశుసంవర్థక శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పశుపోషకులకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. పశువైద్య శాలలను అభివృద్ధిచేయడంతోపాటు పాడిపరిశ్రమను విస్తరించేందుకు మరిన్ని ప్రణాళికలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.


