తణుకు, ఫిబ్రవరి 13, 2026 : విద్యార్థులు తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ, వారి సూచనలు, సలహాల మేరకు విద్యలో ముందుకు సాగాలనీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యను అభ్యసిస్తూనే ముందుకు నడవాలని “రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ” అవార్డు గ్రహీత, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, కోట రామ ప్రసాద్ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. తణుకు పట్టణంలోని టి. వేమవరం ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తొలుత పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కడలి వాణి, ముఖ్య అతిథి కోట రామ ప్రసాద్ కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా, తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జనవరి 23, 24, 25 తేదీల్లో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం వారు నిర్వహించిన బాల బాలికల ప్రతిభాపాటవ ప్రదర్శన కార్యక్రమం “బాలోత్సవం”లో కోట రామ ప్రసాద్ రచించిన ఆహ్వాన గేయం నకు నృత్యం చేసిన విద్యార్థినులు కె.డి.ఎస్. తన్మయి, యం.సౌమ్య, డి. హరిణి, జి. స్నేహశ్రీ భార్గవి, వి.లాస్య లను ఆ గేయ రచయిత కోట రామ ప్రసాద్ శుక్రవారం ఉదయం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రైటింగ్ కిట్స్, బాలోత్సవం ప్రశంసా పత్రాలు బహూకరించి అభినందించారు. అదేవిధంగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన బాలోత్సవం గేయానికి నృత్యం చేసిన విద్యార్థినులకు కూడా కోట రామ ప్రసాద్ పెన్నులు, బాలోత్సవం ప్రశంసా పత్రాలు బహూకరించి అభినందించారు. ఈ రెండు గేయాలకు విద్యార్థినులకు నృత్యంలో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయిని శ్రీమతి దంపనబోయిన కుమారి, ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ శ్రీమతి కడలి వాణి లను కోట రామ ప్రసాద్ అభినందించారు.
ఈ సందర్భంగా కోట రామ ప్రసాద్ ను పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కడలి వాణి, ఉపాధ్యాయినులు దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. తనకు జరిగిన సన్మానానికి కోట రామ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు.


