:- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
టూర్ ఆపరేటర్లే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి దుర్గేష్ వెల్లడి
గడిచిన 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాల సృష్టి
‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పర్యాటక రంగం పరుగులు పెడుతోందని వెల్లడి
విశాఖపట్నం: ‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ కేవలం ఒక సమావేశం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఫిబ్రవరి 13, 14 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న ఈ మెగా టూరిజం మార్ట్‌లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరప్రాంతం, గిరిజన ప్రాంతాలు, వారసత్వ ప్రదేశాలు మరియు ఎకో-అడ్వెంచర్ టూరిజంను ప్రదర్శించడం, దేశీయ పర్యాటకాన్ని పెంచడమే లక్ష్యంతో టూర్ ఆపరేటర్లు, హోటల్ గ్రూప్ లు, ట్రావెల్ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగం అభివృద్ధిలో టూర్ ఆపరేటర్ల ప్రాముఖ్యతను వివరిస్తూ టూర్ ఆపరేటర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు అన్న మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలతో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కేవలం ఆధ్యాత్మిక వారసత్వానికే కాకుండా, పరివర్తన మరియు ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని అన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగలి వెంకయ్య పుట్టిన ఈ నేల పట్ల రాష్ట్రం గర్వపడుతోందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ సంస్కృతిని, రామాయణ కాలం నాటి దండకారణ్య విశేషాలను ప్రస్తావిస్తూ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయానికి ప్రాధాన్యతనిచ్చారు. కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నూతన పర్యాటక పాలసీ 2024-29,పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా, సబ్సిడీలు, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, స్టాంపు డ్యూటీ మినహాయింపులతో ఇన్వెస్టర్లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కేవలం 18 నెలల్లో రూ.20,088 కోట్ల విలువైన 117 ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయని, దీని ద్వారా 1,22,637 ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమమైందని వెల్లడించారు. తద్వారా హోటల్స్, రిసార్ట్స్, థీమాటిక్ పార్క్ లు తదితరాలు పెద్దఎత్తున ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకు వచ్చారన్నారు. కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ మాత్రమే కాకుండా, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. సరళీకృత విధానాలు, సింగిల్ విండో క్లియరెన్స్, ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్స్, రియల్-టైమ్ ట్రాకింగ్, పారదర్శకమైన భూ కేటాయింపులు నిర్ణీత కాలపరిమితిలో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు.
టూర్ ఆపరేటర్లు – మా స్టోరీ టెల్లర్స్:మంత్రి దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ అందాలను దేశ విదేశాల పర్యాటకులకు పరిచయం చేసే కథకులు, ప్రచారకర్తలు, నిర్వాహకులు టూర్ ఆపరేటర్లు అని మంత్రి దుర్గేష్ కొనియాడారు.. “ప్రభుత్వం పునాది వేస్తే, టూర్ ఆపరేటర్లు దానికి ప్రాణం పోస్తారు. మీరు కేవలం వ్యాపారవేత్తలు కాదు, మా రాష్ట్ర అందాలను ప్రపంచానికి వినిపించే స్టోరీ టెల్లర్స్” అని మంత్రి దుర్గేష్ కొనియాడారు. టూర్ ఆపరేటర్లే ప్రభుత్వానికి, మార్కెట్ డిమాండ్‌కు మధ్య వారధి అని, వారే మా అసలైన రాయబారులని పేర్కొన్నారు.ప్రభుత్వం కొత్త సర్క్యూట్లను, క్రూయిజ్లను లేదా హోమ్‌స్టే నమూనాలను ప్రవేశపెట్టినప్పుడు వాటిని మెరుగుపరిచి, ప్రమోట్ చేసినప్పుడే అవి విజయవంతమవుతాయన్నారు. ప్రభుత్వ విజన్‌ను పర్యాటక ప్యాకేజీలుగా, మధుర జ్ఞాపకాలుగా మార్చే శక్తి టూర్ ఆపరేట్లకు ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు టూర్ ఆపరేటర్లు చేతులు కలిపినప్పుడే పర్యాటకం వర్ధిల్లుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలని కోరారు.తద్వారా ఇన్ బౌండ్ టూరిజంను పెంచాలని సూచించారు. సృజనాత్మకత, సంస్కృతి, సామాజిక ప్రభావాల అద్భుత కలయికతో టూర్ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు మరియు భాగస్వాములు అందరం కలిసి ఆంధ్రప్రదేశ్‌ను భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన పర్యాటక కేంద్రంగా (భారతదేశపు ఎక్స్పీరియన్స్ క్యాపిటల్) తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.
భవిష్యత్తు ప్రణాళికలు:
విశాఖ నుండి అరకు వరకు త్వరలో కారవాన్ టూరిజం ప్రారంభిస్తామని, గ్రామీణ సంస్కృతిని పరిచయం చేసేలా హోమ్‌స్టేలు, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ పాలసీ, టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో రాబోయే మైస్, ఫిల్మ్ టూరిజం పాలసీలు అసెట్-లైట్ మోడల్ పెట్టుబడులకు ఊతమిస్తాయని భావిస్తున్నామన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి కుంభమేళా తరహాలో టెంట్ సిటీలను సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రం కేవలం టెంపుల్ టూరిజానికే పరిమితం కాకుండా ఎకో, అడ్వెంచర్, క్రూయిజ్, రివర్, అగ్రి, హెరిటేజ్, మెడికల్ మరియు వెల్ నెస్ టూరిజంకు పెద్దపీట వేస్తోందని వివరించారు. మన రాష్ట్రం పర్యాటక రంగంలో ఒక ‘స్టార్టప్’ లాంటిది. ఇక్కడ వేగం, కొత్త ఆలోచనలు, అద్భుతమైన వృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
డిజిటల్ విప్లవం – పర్యాటక భాగస్వామ్యుల కోసం ఏపీటీఏ ప్రారంభం:
పర్యాటక భాగస్వాముల కోసం ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ పార్ట్ నర్ రిజిస్ట్రేషన్ అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా,పర్యాటక శాఖతో నేరుగా సమన్వయం, డేటా అనలిటిక్స్ మరియు అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు. అలాగే 100కు పైగా ‘అనుభవ కేంద్రాల’ ద్వారా 20,000 మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. 20 కొత్త ఎక్స్ పీరియన్స్ సెంటర్లను వృద్ధి చేస్తున్నామన్నారు.తద్వారా పర్యాటకులకు లీనమయ్యేలా, అత్యంత ప్రామాణికమైన, ప్రత్యక్ష సాంస్కృతిక అనుభూతులు అందిస్తామని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ 2047 మాదిరి ఏపీలో స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా కృషి:మంత్రి దుర్గేష్
తమ టూరిజం పాలసీ స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాన్ని చేరేలా రూపొందించామని మంత్రి దుర్గేష్ వివరించారు. పర్యాటక రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన చేయడం, ఎకానమీ పురోగతికి తోడ్పాటు అందించడమే తమ ధ్యేయమన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అన్నట్లు భవిష్యత్ లో ఒకే ఒక ఇజం ఉంటుంది అదే టూరిజం అని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటించారు.దీంతో సభలో చప్పట్లు మారుమ్రోగాయి. పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, అధికారులు ఇన్వెస్టర్లకు సరైన మార్గదర్శకత్వం అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించిన అన్ని అంశాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచామన్నారు.
స్నేహపూర్వక పర్యాటక పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఇప్పుడే పుంజుకుంటోందన్నారు. ఈ ప్రయాణంలో టూర్ ఆపరేటర్లు భాగస్వాములు కావాలని కోరుతున్నానని అన్నారు. మన భాగస్వామ్యం ద్వారానే ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల అందాలను కూడా పర్యాటక మ్యాప్‌లోకి తీసుకురాగలమని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా అరకు కాపీని ప్రమోట్ చేస్తున్నామన్నారు. అరకు రుచిని చూడాలని కోరారు. పర్యాటకుడు ఒకరోజు పర్యాటక ప్రాంతానికి వస్తే కనీసం 3-5 రోజులు ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం తమ అభిమతం అన్నారు. ఏపీ కేవలం తాము మాత్రమే బాగుపడాలని కోరుకోవడం లేదని అందరూ బాగుపడాలని తమ ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా సర్వేజనా సుఖినోభవంతు, సకలజానాభివృద్ధే తమ లక్ష్యం, వసుధకై కుటుంబంగా ప్రపంచం ఉండాలన్న వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి.
ఆంధ్రప్రదేశ్ ‘అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా’ నేషనల్ ట్రావెల్ మార్ట్ 2026 దేశీయ పర్యాటక రంగంలో ఒక నూతన మైలురాయి అని వక్తలు పేర్కొన్నారు. ఇది ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకమని నిరూపించిందని తెలిపారు. ఈ మార్ట్‌లో దాదాపు 700 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి 500 మందికి పైగా బయ్యర్లు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి 80 మందికి పైగా సెల్లర్లు పాల్గొన్నారని పేర్కొన్నారు. వేల సంఖ్యలో జరిగిన బి2బి సమావేశాల ద్వారా పర్యాటక రంగంలో అర్థవంతమైన వ్యాపార మార్పిడిలు మరియు దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు పునాది పడిందన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, జమ్మూ , కాశ్మీర్, ఉత్తరాఖండ్, అండమాన్, నికోబార్ వంటి దాదాపు అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరై, దీనిని ఒక మినీ ఇండియా పండుగలా మార్చడం విశేషం. ఈ మార్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధిక విలువ కలిగిన దేశీయ పర్యాటక గమ్యస్థానంగా రూపాంతరం చెందుతున్న తీరును ప్రపంచానికి చాటారు. ఆధ్యాత్మిక యాత్రలు, తీరప్రాంత పర్యాటకం, వారసత్వ సర్క్యూట్లు, గిరిజన పర్యాటకం, బౌద్ధ సర్క్యూట్, ఎకో-టూరిజం మరియు మైస్ వంటి వర్ధమాన రంగాల సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించారు.ఈ మార్ట్ ద్వారా రాష్ట్ర పర్యాటక భాగస్వాములు మరియు జాతీయ టూర్ ఆపరేటర్ల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది.
ఏపీ పర్యాటక రంగ విశేషాలను పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలికాట వివరించారు. 3P మోడల్ పాలసీ, పార్ట్ నర్ షిప్, ప్రాసెస్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని వారు తెలిపారు.ఏపీ పర్యాటక కొత్త పాలసీ 2024-29 ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికామన్నారు.
కార్యక్రమంలో ఛత్తీస్ గడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నీలూశర్మ, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, ఛత్తీస్ గడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ వివేక్ ఆచార్య, ఏపీటీడీసీ ఈడీ పద్మావతి, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, ఏడీటీవోఐ ప్రెసిడెంట్ వేద్ ఖన్నా, విజయ్ మోహన్ , స్వామినాయుడు, మహాపాత్ర, టూర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు


