నిడదవోలు పట్టణంలోని చర్చ్ పేటలోని డా. బి.ఆర్. అంబేద్కర్ పురపాలక పాఠశాల సందర్శన.. అనంతరం శ్రీ రాజరాజేశ్వరీ సమేత గోలింగేశ్వర ఆలయ దర్శనం
నిడదవోలు, జనవరి 31: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. నిడదవోలు పట్టణం చర్చ్ పేటలోని డా. బి.ఆర్. అంబేద్కర్ పురపాలక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు.పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, భోజనం నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.తరగతి గదుల్లో బోధన జరుగుతున్న తీరుపై విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు.
అనంతరం నిడదవోలు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరీ సమేత గోలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మంత్రి దుర్గేష్ సందర్శించారు. ఆలయ అర్చకులు మంత్రి దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఆ తర్వాత నిడదవోలు పట్టణంలోని నంగాలమ్మ గుడి దగ్గరి నుంచి గౌడ వీధి రామాలయం వరకు పలు వార్డుల్లో డ్రెయిన్ల పనితీరును, వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. నిడదవోలు పట్టణంలోని 10వ వార్డు రజకుల వీధికి వెళ్లిన మంత్రి దుర్గేష్ స్థానికులతో మాట్లాడారు. రజకులకు కమ్యూనిటీ హాల్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


