పర్యాటక హబ్‌గా అనకాపల్లిని తీర్చిదిద్దుతాం

:- మంత్రి కందుల దుర్గేష్

ముత్యాలమ్మపాలెం తీరంలో జరుగుతున్న అనకాపల్లి ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

ఉత్తరాంధ్ర సంస్కృతికి అనకాపల్లి ఉత్సవ్ వేడుకలు అద్దం పడుతున్నాయని వెల్లడి

అనకాపల్లి: విశాఖ ఉత్సవ్ లో భాగంగా అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం తీరంలో నిర్వహిస్తున్న ‘అనకాపల్లి ఉత్సవ్’ నిజమైన ప్రజా ఉత్సవంగా సాగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు,ఎంపీ సీఎం రమేశ్, సహచర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు గారు, సుందరపు విజయ్ కుమార్ లతో కలిసి పాల్గొన్న అనకాపల్లి ఉత్సవ్ లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఆద్యంతం ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో, సుందరమైన సముద్రతీరంలో జరుగుతున్న ఈ వేడుకలు ఉత్తరాంధ్ర ఆచారాలను, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా దిగ్విజయంగా సాగుతున్నాయన్నారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి భారీ పర్యాటక ఉత్సవం కావడంతో స్థానికుల్లో, పర్యాటకుల్లో మిన్నంటిన ఉత్సాహాన్ని ఆయన కొనియాడారు.జిల్లా ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. సుందరమైన ముత్యాలమ్మపాలెం సముద్రతీరంలో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అనకాపల్లి జిల్లా కేవలం పారిశ్రామికంగానే కాకుండా ఎంఎస్ఎంఈలకు, అద్భుతమైన వంటకాలకు, రుచులకు ఇలా ఎన్నో ప్రత్యేకతలకు పెట్టింది పేరు అని కొనియాడారు. విశాఖ ఉత్సవ్ లో భాగంగా అరకు ఉత్సవ్ ను కూడా అత్యద్భుతంగా నిర్వహించామన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దూరదృష్టితో రాష్ట్రంలో పర్యాటక రంగానికి పునర్వైభవం లభిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణ కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నామని, అనకాపల్లి జిల్లాను పర్యాటక హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.విశిష్టమైన ప్రకృతి సౌందర్యం కలిగిన ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం బీచ్‌లను త్వరలోనే అత్యాధునిక హంగులతో సుందరీకరించి, పర్యాటకులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని ప్రకటించారు.

ఇంతటి భారీ వేడుకను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజా ప్రతినిధులను, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు, నిర్వాహక బృందాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.అనకాపల్లి ఉత్సవాలు కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా రూపొందించబడ్డాయన్నారు. ఈ ఉత్సవ్ లో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు పెద్దపీట వేయడం ఆనందంగా ఉందన్నారు.ఈ ఉత్సవాల ద్వారా అనకాపల్లి జిల్లాకు పర్యాటక చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరిగిన సంతృప్తికి, ఈ ఉత్సవాలకు పోటెత్తిన జనసందోహమే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ హామీల తీరును, తద్వారా సామాన్యులకు చేకూరుతున్న లబ్ధిని ఆయన వివరించారు.ప్రజల్లో ఆనందం, సంతోషం నింపడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇప్పటికే విజయవాడ ఉత్సవ్, గండికోట ఉత్సవ్, ఫ్లెమింగో ఫెస్టివల్, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ తదితర ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని ఆ పరంపరలోనే ప్రస్తుతం విశాఖ ఉత్సవాన్ని అందులో భాగమైన అరకు, అనకాపల్లి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కళా వైభవాన్ని చాటిచెప్పిన స్థానిక కళాకారులను, ప్రదర్శనలు ఇచ్చిన సినీ ఆర్టిస్టులను మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఉత్సవాలను మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Scroll to Top
Share via
Copy link