తణుకులో ఘనంగా జరిగిన బాలోత్సవం సన్నాహక సమావేశం

తణుకు, డిసెంబర్ 20, 2025 : పిల్లల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలు, సామాజిక స్పృహను పెంపొందించడంలో బాలోత్సవం కీలక పాత్ర పోషిస్తుందని తణుకు బాలోత్సవం నిర్వహణ కమిటీ ఛైర్మన్ గమిని రాంబాబు అన్నారు. బాలోత్సవ నిర్వహణ తణుకు కు గర్వకారణంగా నిలిపే బాధ్యత బాలోత్సవ కమిటీ సభ్యులు అందరిపై ఉందని ఆయన అన్నారు.

శనివారం సాయంత్రం శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తణుకు గమిని ఫంక్షన్ హాల్ లో తణుకు బాలోత్సవం నిర్వహణ సన్నాహక సమావేశం జరిగింది.

శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు పి.ఎల్.నరసింహారావు, ప్రధాన కార్యదర్శి పి. దక్షిణా మూర్తి, విద్యావేత్త బి. విద్యాకాంత్, మానవత శాంతి ర్యాలీ ఛైర్మన్ గమిని రాంబాబు, మానవత తణుకు శాఖ అధ్యక్షులు కడించర్ల రాజ రాజేశ్వరరావు ప్రభృతులు సభా వేదికను అలంకరించారు.

శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు, బాలోత్సవం ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి పి.ఎల్.నరసింహారావు మాట్లాడుతూ తణుకులో బాలోత్సవం 2026 జనవరి 23, 24, 25 తేదీల్లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామని చెప్పారు. బాలోత్సవం ద్వారా బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. విద్య, కళలు, క్రీడలు, నైతిక విలువల సమ్మేళనంగా ఈ కార్యక్రమం నడుస్తుంది ఆయన చెప్పారు.

శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి, బాలోత్సవం నాయకులు పోపూరి దక్షిణా మూర్తి మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో బాలోత్సవాన్ని విజయవంతం చేయడం తమ లక్ష్యమనీ, ఈ బాలోత్సవం నిర్వహణలో ప్రతీ సంస్థ చురుకుగా పాల్గొని ఈ వేడుకను ఒక మైలురాయిగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.

రిటైర్డ్ ప్రొఫెసర్ డా. జుత్తిగ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, బాలోత్సవంలో పాల్గొనే బాలబాలికల ప్రదర్శనలలో ఉత్తమ ప్రదర్శనలు విద్యా సంస్థలు ఎంపిక చేసి పోటీకి పంపాలని సూచించారు.

జీవ శాస్త్ర ఉపాధ్యాయులు, ప్రముఖ మెజేషియన్, సైకాలజిస్ట్, “గోపి మామ” గా సుప్రసిద్ధులు బి.యం.గోపాల రెడ్డి మాట్లాడుతూ, గత తరంలో తాము ఆడిన ఆటలు ఈ తరం పిల్లలు ఎరుగరనీ, పిల్లలు చదువులో పడి మానసిక వత్తిడికి గురవుతున్నారని వివరించారు. మానసిక ఉల్లాసానికి పిల్లలకు ఆట పాటలు అవసరం అని చెప్పారు.

రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, సైకాలజిస్ట్, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ మాట్లాడుతూ, గత తరాల బాలల వలె, నేటి బాల బాలికలు బంగారు బాల్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక విప్లవం వల్ల వచ్చిన సెల్ ఫోన్, టాబ్, టీవీ, కంప్యూటర్ లకు బానిసలై, బాలలు బాల్యంలో ఆట పాటలకు దూరం అవుతున్నారని ఆయన వివరించారు. బాలబాలికల్లో ద్విగుణీకృతమైన సృజనాత్మక శక్తులను “బాలోత్సవం” వేదిక ద్వారా వెలికి తీస్తున్న శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా బాలోత్సవం ఆహ్వాన పత్రికను, బ్రోచర్ ను సభా వేదికను అలంకరించిన ప్రముఖులు, సభలో పాల్గొన్న ప్రముఖులు సామూహికంగా ఆవిష్కరించారు.

బాలోత్సవం నిర్వహణలో తమ వంతు సహకారం అందిస్తామని మానవత, రోటరీ క్లబ్, అప్పుస్మా, సీ.ఐ.టీ.యూ, లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్, మెడికల్ రెప్రజెంటేటివ్స్ యూనియన్లు తదితర సంస్థలు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కె.ఎల్. శశాంక్, రాజ శేఖర్, శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం కోశాధికారి ఎ.ఎస్.వి.శేషు బాబు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయినులు శ్రీమతి ముసునూరి అన్నపూర్ణ, శ్రీమతి పి.రాజ్యలక్ష్మి, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link