:- మంత్రి కందుల దుర్గేష్
త్వరలోనే వెబ్ సైట్ ద్వారా పబ్లిక్ డొమైన్ లో నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివరాలు
యంగ్ ప్రొఫెషనల్ టీం రూపొందించిన స్వర్ణ నిడదవోలు బులెటిన్ ప్రతిని ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: రాష్ట్రంలోనే తొలిసారి నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన వివరాలు తెలిపే బులెటిన్ ను రూపొందించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నిడదవోలు పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అనుసంధానంగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 ఏర్పాటు చేసి సంబంధిత లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నారన్నారు. పీ4 లో భాగంగా మూడు నెలల క్రితం స్వర్ణ నిడదవోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అందులో భాగంగా ప్రతినెల ఏయే కార్యక్రమాలు చేస్తున్నామనే అంశంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రొఫెషనల్ టీం బులెటిన్ అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సంబంధిత బులెటిన్ బ్రోచర్ ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి, పీ 4 కార్యక్రమ అమలు తీరుకు సంబంధించి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వెబ్ సైట్ ను రూపొందించామని, త్వరలోనే అది పబ్లిక్ డొమైన్ లో పెడతామని మంత్రి పేర్కొన్నారు. ఆ వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన తాజా అంశాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా బులెటిన్ రూపొందించిన నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ టీంను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏ నియోజకవర్గంలో లేని విధంగా తొలిసారి నిడదవోలులో ఈ తరహా వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
అదే విధంగా ఎన్జీవోస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున అధునాతన టెక్నాలజీ సహాయంతో ఏపీలోని ప్రతి పర్యాటక ప్రాంతాన్ని ప్రపంచం, పర్యాటకుడు చూసి, తెలుసుకునేలా సాఫ్ట్ వేర్ రూపొందించామని వెల్లడించారు. తద్వారా ఒక్కో పర్యాటక ప్రాంతానికి సంబంధించి రెండు నుండి ఐదు నిమిషాల నిడివి గల వీడియోలను ట్రైలర్ గా రూపొందించామని సంబంధిత కంపెనీ ప్రతినిధి తెలిపారు. దీనివల్ల రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతను గురించి వివరించి, చారిత్రక నేపథ్యం తెలిపి, సంబంధిత ప్రాంతాలను చూసేలా ఉత్సుకత ను రేకెత్తిస్తామని అన్నారు. ఎక్కడైతే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో సంబంధిత ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లో స్టాల్ ను ఏర్పాటు చేసి వర్చువల్ ఎక్స్పీరియన్స్ (వీఆర్) ద్వారా పర్యాటలకు అవగాహన కల్పిస్తామన్నారు. తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గం లోని తిమ్మరాజుపాలెం లో కొలువైన కోట సత్తెమ్మ ఆలయానికి సంబంధించిన విజువల్స్ షూట్ చేశామని, సంబంధిత ఆలయాన్ని వీఆర్ ద్వారా నేరుగా ఎక్స్పీరియన్స్ చేయవచ్చని తెలిపారు.ఈ క్రమంలో ఆలయానికి మంచి ప్రాచుర్యం లభిస్తుందని తెలిపారు. సంబంధిత వీడియోను ఐ లవ్ నిడదవోలు పార్క్ దగ్గర ప్రజలకు అందిస్తామని తెలిపారు. మంత్రి దుర్గేష్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ తరహా టెక్నాలజీ ద్వారా పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు


