:- మంత్రి కందుల దుర్గేష్
తద్వార ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ వృద్ధికి, ఉపాధికి విస్తృత అవకాశాలుంటాయని పేర్కొన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు: ఏపీకి ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ రాకతో విశాఖపట్నం గ్లోబల్ కనెక్టివిటీ కేంద్రంగా మారనుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు ప్రత్యేక దృష్టి సారించి ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ను ఏపీకి తీసుకొచ్చారని, అది వైజాగ్ లో ఏర్పాటు కాబోతుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఏఐ హబ్, డేటా సెంటర్ ఐటీ రంగంలో ఏపీని శరవేగంగా దూసుకెళ్లేందుకు దోహదపడున్నాయన్నారు. రాష్ట్ర ఐటీ రంగాన్ని మలుపుతిప్పే గేమ్ ఛేంజర్ గా నిలవనున్న ఈ డేటా సెంటర్ 12 దేశాలకు అనుసంధానం చేయబడుతుందని వివరించారు. ఇక్కడ డేటా స్టోరేజీతో పాటు కృత్రిమ మేధా ఆధారిత అప్లికేషన్స్ ను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన కంప్యూటింగ్ సదుపాయాల్ని సమకూర్చనుందని, రాబోయే రోజుల్లో డేటా సెంటర్ కు అనుబంధంగా ఏర్పాటయ్యే కంపెనీలతో పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికి కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు


