కూటమి కలిసే ఉంటుంది.. కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించమని హెచ్చరిక
:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: నిడదవోలులో కూటమి మధ్య ఎలాంటి తారతమ్య బేధాలు లేవని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కూటమి అంతా ఒకేతాటిపై నిలబడి ఉందని ఘంటాపథంగా తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రతి మండలంలోని కూటమి నాయకులు చర్చించుకున్న అనంతరమే లోతుగా అధ్యయనం చేసి అందరికీ సముచితమని అనుకున్నాకే ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమిలో విబేధాలు సృష్టించేలా కొన్ని ఛానళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయన్నారు. కూటమిలో వైషమ్యాలు సృష్టిస్తూ వక్రీకరిస్తున్నారని అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి కలిసే ఉంటుంది..కలిసే ఉండి బుద్ధి చెప్తామని స్పష్టతనిచ్చిన మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా కూటమిలో విబేధాలు అన్న వార్తలకు చెక్ పెట్టారు.
కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా అనవసర దుష్ప్రచారాలకు తెరతీయడం మంచి పద్ధతి కాదని, సామాజిక బాధ్యతతో కథనాలు రాస్తే, ప్రసారాలు ప్లే చేస్తే ఎవరైనా హర్షిస్తారని పేర్కొన్నారు. వ్యక్తిగత విద్వేషాలు రెచ్చగొట్టేలా, పార్టీల మధ్య వైషమ్యాలు సృష్టించేలా కుట్రపూరితంగా, అక్కసుతో వార్తాకథనాలు రాయడం జర్నలిజం అనిపించుకోదన్నారు.


