ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఈనెల 16న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన విజయవంతం చేయాలని తణుకు ఎమ్మెల్యే, ఎమ్మిగనూరు నియోజవర్గ పరిశీలకులు ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఓర్వకల్లు మండలం నన్నూరులో జరగనున్న ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. 2017లో ప్రధానిగా నరేంద్రమోదీ పని చేసిన సమయంలో 17 రకాల పన్నులను జీఎస్టీ మొదటి దశ సంస్కరణల్లో భాగంగా నాలుగు శ్లాబులకు తీసుకువచ్చారని చెప్పారు. తిరిగి 2024లో చారిత్రాత్మక సంస్కరణలకు నాంది పలుకుతూ మరోసారి జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టిన నరేంద్రమోదీ నాలుగు శ్లాబులను 5 శాతం, 18 శాతానికి తీసుకువచ్చారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోడం అభినందనీయమన్నారు. దీని ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు ఆర్థిక వనరులను పెంపొందించుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. నియోజకవర్గం నుంచి 20 వేల మందిని మోదీ సభకు తరలించడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్రమోదీతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కూటమి నాయకులు హాజరవుతారని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.


