గ్రామంలో జలజీవన్ మిషన్ పనులకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు ఉన్నాయా? పక్కదారి పట్టాయా? అనే అనుమానం వస్తుందని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు అన్నారు. తణుకు తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో సిపిఎం బృందం తహసిల్దార్ డి.వి.ఎస్.ఎస్ అశోక వర్మ కి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామంలో పైపులైన్లు పునరుద్ధరణ చేసి రక్షిత మంచినీటి సరఫరా పథకం అభివృద్ధి పరచి ఇంటింటికి ఉచిత కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు రూ.274.59 లక్షలు కేటాయించి 2022లో ఆనాటి స్థానిక మంత్రి శంకుస్థాపన చేసిపనులు ప్రారంభించిన విషయాన్ని వీరభద్రరావు గుర్తు చేశారు. గ్రామములో కుళాయి కనెక్షన్ కావలసిన లబ్ధిదారులు సచివాలయాలు వద్ద ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు రూ.100 నగదు చెల్లించి దరఖాస్తు పెట్టుకున్నారని ఆయన తెలిపారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా 9వ వార్డు 10వ వార్డుతో పాటు ఇతర కొన్ని ప్రాంతాలకు పైపులైన్లు వెయ్యకపోవడం వలన నేటికీ ఇంటింటికి కుళాయిలు ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమస్యను పరిష్కరించాలని గతంలో పంచాయతీ, మండల తహసిల్దార్ కార్యాలయాలలో అధికారులకు వినతి పత్రాలు ద్వారా సమస్యని పరిష్కరించమని కోరినప్పటికీ ఎటువంటి ఫలితం లేదన్నారు. అందుకు సిపిఎం ఆధ్వర్యంలో 4 రోజులపాటు 9 -10 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సంతకాలు సేకరించామన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జలజీవన్ మిషన్ పనులు త్వరతిగతిన ప్రారంభించి ఇంటింటికి ఉచిత కుళాయిలు వెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని వీరభద్రరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం10వ వార్డు శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వర్రావు, కర్ణాటపు నరసింహారావు, తాళ్ల సత్యనారాయణ, వాసా పోసియ్య తదితరులు పాల్గొన్నారు.


