తణుకు పట్టణంలో ఎక్సైజ్ సోదాలు; గంజాయి రవాణా దారులు అరెస్ట్
తణుకు పట్టణంలో ఉండ్రాజవరం సెంటర్ నుండి పాలంగి వెళ్లే రోడ్డులో తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిపిన సోదాలలో స్కూటీలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు. పట్టుబడిన యువకులు స్థానిక పైడిపర్రు, మండపాక గ్రామాలకు చెందిన యువకులుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు పోలవరపు కుమార్ శివ పరారీలో ఉన్నాడని, మీసాల ఈశ్వరరావు, చీలి వినయ్ లు ఇద్దరికీ ప్రధాన నిందితుడు పొలవరపు శివకుమార్ గంజాయిని సరఫరా చేస్తున్నాడని అన్నారు. ఈ విధంగా నిందితులు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తణుకు పట్టణములో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. కేజీ గంజాయిని 3000 చొప్పున కొనుగోలు చేస్తున్నారని, ఈ సోదాలో మొత్తం పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.15,000 రూపాయలు ఉంటుందన్నారు. ఈ సోదాలలో తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.మణికంఠరెడ్డి తో పాటు తణుకు డిప్యూటీ తహశీల్దార్ నీలి శ్రీదేవి, వీఆర్వో బసవ వెంకటరత్నం, ఎస్సై ఆర్. మధుబాబు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి మాట్లాడుతూ గంజాయి రవాణా, అమ్మకములు చేస్తే కఠిన చర్యలు తప్పవని గంజాయి కి సంబంధించి నిల్వలు, రవాణా, అమ్మకాలుకు సంబంధించి సమాచారాన్ని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారికి 9440902436 నెంబర్ కి తెలియపరచవలసిందిగా కోరారు.


