అపుస్మా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కారాలు
తణుకు డివిజన్ పరిధిలో గురు పూజోత్సవ వేడుక
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గురువుగా నిరంతరం ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది మార్గదర్శిగా నిలిచి రెండో రాష్ట్రపతిగా పని చేసిన వ్యక్తిని ఆదర్శనీయంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో తణుకు జోన్ పరిధిలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు జోన్ పరిధిలోని దాదాపు 2 వేల మంది ఉపాధ్యాయులు ఉంటే వారిలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన 57 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సత్కరించుకోవడం అభినందనీయం అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని విద్యావ్యవస్థను బలోపేతం చేసిన దారిలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంతో విద్యావ్యవస్థను గాడిలో పెట్టారని అన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలకు నాంది పలికారని అన్నారు. మొదటి ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి తల్లిదండ్రుల సమావేశాలను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేశారని అన్నారు. ప్రతి గ్రామంలో మోడరన్ స్కూలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో లోకేష్ పని చేస్తున్నాని చెప్పారు. ప్రైవేటు స్కూలు యాజమాన్యాలకు సైతం తగిన సహకారం అందిస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారని అన్నారు. సమర్థవంతమైన నాయకుడు అధికారంలో ఉంటే విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని చంద్రబాబు, లోకేష్‌లు తమ వంతు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఎదురవుతున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసికెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బూరుగుల్లి వేణుగోపాలకృష్ణ, ప్రగతి రాజా, అనపర్తి ప్రకాశరావు, ఎల్.కె.త్రిపాఠి, విద్యాకాంత్ తదితరులు పాల్గొన్నారు.


