త్రిసభ్య కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ
సొసైటీలు అందించే సేవలు రైతులకు ఉపయోగకరంగా ఉంటున్నాయని వీటిని మరింత బలోపేతం చేసే దిశగా త్రిసభ్య కమిటీలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన తణుకు నియోజకవర్గంలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఇప్పటికే త్రిసభ్య కమిటీ సభ్యులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో సొసైటీల్లో అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉండేందని, ముఖ్యంగా నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం ఉండేదని ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిసభ్య కమిటీలు నియమించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో తేతలి, తూర్పువిప్పర్రు, రాపాక సొసైటీల్లో నిధుల దుర్వినియోగం కావడంతో నిర్వీర్యం అయిపోయాయని చెప్పారు. గతంలో విజయవాడకు చెందిన కేఎన్ఆర్ ఇండియా సంస్థ ద్వారా సొసైటీకు సరఫరా చేసిన పరికరాలు మూలకు చేరాయని గుర్తు చేశారు. సొసైటీల ద్వారా విరివిగా రుణాలు ఇచ్చిన రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ, జిల్లా రిజిస్ట్రార్ ఆరిమిల్లి శ్రీనివాస్, తణుకు ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివ, సొసైటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.


