సొంతూరుకు చేసింది ఏంటి కారుమూరీ..?

బియ్యం అక్రమ రవాణా చేసింది మీరు కాదా

అక్రమ మైనింగ్‌ చేసింది కారుమూరి కాదా?

తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ ప్రశ్నలు

గత అయిదేళ్ల కాలంలో సొంతూరు అత్తిలికి ఏం చేశారో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పాలని తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ ప్రశ్నించారు. అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నామని ప్రకటించిన కారుమూరి కనీసం ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉండగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేశారని అన్నారు. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా దక్షిణ ఆఫ్రికా దేశానికి తరలించి అక్కడికి స్వయంగా వెళ్లిన కారుమూరి డబ్బులు తెచ్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మద్యం షాపుల్లో అమ్మిన కల్తీ మద్యం సరఫరా విషయంలో కారుమూరితోపాటు ఆయన అనుచరులే ముఖ్య భూమిక పోషించారని సిట్‌ సైతం వెల్లడిస్తోందన్నారు. త్వరలోనే కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కారుమూరి ఎమ్మెల్యేగా మొదటి సారి నామినేషన్‌ వేసిన సమయంలో ఆస్తులు ఎంత 2014లో నామినేషన్‌ వేసినప్పుడు ఎంత 2019లో నామినేషన్‌ సమయంలో ఎన్ని ఆస్తులు… 2019–24 మధ్య కాలంలో మంత్రిగా అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ద్వారకాతిరుమల ప్రాంతంలో మైనింగ్‌ లైసెన్సు దారులను బెదిరించిన కారుమూరి తన పైనా, బినామీల పైనా లైసెన్సులు మార్చుకుని అక్రమ మైనింగ్‌కు పాల్పడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నెల్లూరులో సైతం అక్రమ మైనింగ్‌ గురించి నియోజకవర్గ ప్రజలకు వివరిస్తారా అని కొండేటి శివ సూటీగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ టిడిపి అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, అత్తిలి మండలం టిడిపి అధ్యక్షులు పోలిశెట్టి చందు, నాయకులు పితాని మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link