ఉండ్రాజవరం, ఆగస్టు 20, 2025 : “మానవత” స్వచ్ఛంద సేవా సంస్థ సమాజ సేవ చేస్తున్నదనీ, సమాజంలో పేద ప్రజలను, పేద విద్యార్థులను, వికలాంగులను దాతల సహకారంతో ఆదుకొంటున్నదని ఉండ్రాజవరం మండల మానవత సంస్థ శాఖ డైరెక్టర్ కఠారి సిద్ధార్థరాజు అన్నారు. “మానవత” స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు, సంస్థ సీనియర్ నాయకులు తాతిని వెంకట కృష్ణారావు, వెలిచేటి బోస్ ల సూచనల మేరకు, తూర్పు గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండల “మానవత” శాఖ ఆధ్వర్యంలో, మండలంలోని సూర్యారావు పాలెం గ్రామంలో ఘనంగా జరిగిన శాంతి ర్యాలీ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మండలశాఖ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శాంతిర్యాలీని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయులు జి.పౌలు ప్రకాశం, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినీవిద్యార్థుల సహకారంతో నిర్వహించారు. విద్యార్థులు “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “ప్రపంచ శాంతి – వర్ధిల్లాలి”, “మానవ సేవయే – మాధవ సేవ”, “ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అని నినదించారు. ఈ కార్యక్రమంలో “మానవత” గేయ రచయిత కోట రామ ప్రసాద్, రుద్రు ధన నరసింహారావు, అన్నే వెంకటేశ్వరరావు, నగుబత్తుల దుర్గారావు, దూది సూర్యనారాయణ, సుంకవల్లి వెంకటేశ్వరరావు, వాకలపూడి రామకృష్ణ, పైపూరి మాణిక్యాలరావు, వీరవల్లి వెంకట సుబ్బారావు, పిపిరిశెట్టి తాతారావు ప్రభృతులు పాల్గొన్నారు.


