రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలి

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రంలో శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 43వ కళా సమ్మేళం-2025లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

కళా వైభవాన్ని చాటేలా నృత్యరూపకాలు ప్రదర్శించిన చిన్నారులను అభినందించిన మంత్రి దుర్గేష్

కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబాలని తెలిపిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం: కళలకు కాణాచి అయిన సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని ఆనం కళాక్షేత్రంలో జరిగే కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గురువారం రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రం నందు 12 జూన్ నుండి 15 జూన్ వరకు శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వారిచే నిర్వహించబడుతోన్న “43వ కళా సమ్మేళనం–2025” కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళా వైభవాన్ని చాటేలా నృత్యరూపకాలు ప్రదర్శించిన పలువురు చిన్నారుల నృత్య ప్రదర్శనలను మంత్రి దుర్గేష్ ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాధాకృష్ణ కళాక్షేత్రం 4 దశాబ్దాలుగా కళారంగానికి , కళామతల్లికి నిరాటంకంగా చేస్తున్న సేవలను కొనియాడారు. నృత్యం చేసిన చిన్నారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా కళాకారుడు నారాయణ రావు కృషిని మంత్రి అభినందించారు. ఆయన ప్రతిభా సంస్కృతీ సౌరభాలు కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇటీవల జరిగిన కుంభమేళాలో సైతం ప్రదర్శించి పలువురి మన్ననలు పొందారని గుర్తుచేశారు. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం, రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్న వయస్సులోనే నారాయణ రావు కూతురు లక్ష్మీ గీతిక కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సి, మోహని అట్టం వంటి నృత్యాల్లో ప్రతిభ చూపి ఉపరాష్ట్రపతి నుండి అవార్డు అందుకున్నారని మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రాష్ట్రపతి అవార్డు సైతం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి దుర్గేష్ తెలిపారు. శనివారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ ప్రదర్శనలకు హాజరుకానున్నారని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో రాధాకృష్ణ కళాక్షేత్రం సభ్యులు ఆచారి, భగవాన్, చంద్రశేఖర్, దాసరి ధర్మరాజు, కళాకార్యక్రమ నిర్వాహకులు నాగేశ్వరరావు, నృత్యాన్ని ప్రదర్శించిన చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link