అనేక చారిత్రాత్మక ఘట్టాలకు వేదిక పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగరంలో శ్రీ పోతుల వీరభద్రరావు పేరుతో ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ స్టేడియం అన్ని పనులు పూర్తిచేసుకొని క్రీడాకారులకు త్వరితగతిన అందుబాటులోనికి తీసుకురావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ క్రింద రూ. 7 కోట్ల అంచనా వ్యయంతో నాగుల చెరువు స్టేడియంను క్రికెట్ గ్రౌండ్ గా అభివృద్ధి చేసేందుకు గాలి సుబ్బరాజు కన్ స్ట్రక్షన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి గురువారం మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వయానా మా తాత పోతుల వీరభద్రరావు పేరుతో ఎమ్మెల్యే గోరంట్లబుచ్చయ్య చౌదరి స్టేడియాన్ని పునరుద్ధరించడం ఆనందంగా ఉందన్నారు. పుత్రవాత్సల్యంతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అందిస్తున్న కానుకగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా అనేక చారిత్రాత్మక ఘట్టాలకు ఈ స్టేడియం వేదిక అని నేపథ్యాన్ని గుర్తుచేశారు. తన విద్యార్థి దశలో ఈ స్టేడియంలో ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కీ.శే ఎన్టీఆర్, మాజీ ప్రధాని వాజ్ పేయిలు ప్రసంగించారని తెలిపారు. నాడు వారి మాటలను వెంకయ్యనాయుడు అనువదించిన తీరు మననం చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నాడు ప్రఖ్యాతిగాంచిన నింబుల్స్ లెవన్ పుట్ బాల్ ప్లేయర్లు, సుంకర భాస్కరరావు, స్వయాన మా తాత పోతుల వీరభద్రరావు లాంటి క్రీడాకారులు ఈ స్టేడియంలో ఆడారని వివరించారు. అనంతరం పిచ్చయ్య, తమిళనాడు ఆటగాడు కరీముల్లా లాంటి క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ ఆడటం తాను స్వయంగా చూశానన్నారు. చాలా దశాబ్దాలుగా ఈ స్టేడియానికి సరైన రూపం ఇచ్చేందుకు సాధ్యపడలేదన్నారు. ఈ క్రమంలో అభివృద్ధి చిరునామాగా నిలిచిన బుచ్చయ్యచౌదరి నేతృత్వంలో స్టేడియం రూపుదిద్దుకుంటుండటం ఆనందంగా ఉందన్నారు.

గతంలో కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండటం వల్ల చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో సరైన స్టేడియాలు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చయ్యచౌదరి చొరవతో స్టేడియం నిర్మితమవుతుందన్నారు. స్థానికంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటుచేసేందుకు 12 ఎకరాల స్థలం అవసరమని భావించి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. త్వరలోనే క్రికెట్ స్టేడియం కార్యరూపం దాల్చేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. ఇది మల్టీపర్పస్ స్టేడియంగా భావించాలన్నారు. ఇండోర్ గేమ్స్, జిమ్ తదితర వ్యాయామాలతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ కు మాత్రమే దీన్ని వినియోగించాలన్నారు. పూర్తిస్థాయి క్రికెట్ ఆడేందుకు ఇది సరిపోదని మంత్రి దుర్గేష్ అన్నారు.

టీడీపీ ఆవిర్భావం నుండి అదే పార్టీని శ్వాసగా, ఊపిరిగా భావించి ఉన్న వ్యక్తి, రాష్ట్రంలో సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆధునిక రాజమహేంద్రవరాన్ని తయారు చేసిన మోడ్రన్ ఆర్కిటెక్ట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అని కొనియాడారు. రాజకీయాలపై స్పష్టమైన అవగాహన, అభివృద్ధి చేయాలన్న తపన, ఏ కార్యక్రమం చేసినా రాజమహేంద్రవరం అభివృద్ధికి ఉపయోగపడుతుందా అన్న ఆలోచన నేటి సమకాలిక రాజకీయాల్లో బుచ్చయ్యచౌదరికే సొంతమని వెల్లడించారు

ప్రపంచంలోనే ఉక్కుమనిషిగా పేరొందిన ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో గ్రేట్ విజనరీగా పేరొందిన సీఎం చంద్రబాబునాయుడు, పేదల కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విజయాలను వివరిస్తూనే అభివృద్ధి, సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడాను స్పష్టంగా తెలిపారు. నాడు జగన్ మోహన్ రెడ్డి వృద్ధులకు అందించే పెన్షన్ ను రూ.2000 నుండి రూ.3000 పెంచేందుకు ఐదేళ్ల కాలం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రూ.3000 పెన్షన్ ను రూ.4000 కు పెంచిందన్నారు. అదే విధంగా దివ్యాంగులకు రూ.6000, మంచానికే పరిమితమైన, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15000 పెన్షన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. దీపం-2 పథకం ద్వారా నిరుపేద ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. తల్లికి వందనం కార్యక్రమం నేటి నుండి ప్రారంభిస్తున్నామన్నారు. తద్వారా కుటుంబంలో చదివే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో రూ.15వేలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కుటుంబంలో అందరికీ ఇస్తానని మాట తప్పిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లినప్పటికీ ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ పేరుతో గత ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 16వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 20 లక్షల ఉద్యోగాల కల్పన కేబినెట్ సబ్ కమిటీ సభ్యుల్లో తాను ఒకరినని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రజల సంతృప్త స్థాయిని పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే బంగారు భవిష్యత్ తథ్యమని మంత్రి కందుల దుర్గేష్ ప్రజానీకానికి భరోసానిచ్చారు. పీ4 విధానంతో ప్రజల జీవితాలు మరింత బాగుపడతాయన్నారు.

పట్టణ ప్రాంతాల్లో అమృత్ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు నీరు అందించేందుకు ఏషియన్ బ్యాంక్ నిధులు మంజూరు చేస్తే గత ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ పథకాలను పట్టాలెక్కించి ప్రతి ఇంటికి నీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రేట్ విజినరీ ఆఫ్ ఇండియాగా పేరొందిన సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్తుందదని ఆశాభావం వ్యక్తం చేశారు. తన స్వంత డబ్బులతో పేద ప్రజలకు అండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న సాయాన్ని వివరించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి ప్రజల బాగు కోసం కృషి చేస్తున్న తమది పేద ప్రజల ప్రభుత్వమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకులు సోమువీర్రాజు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, నార్ని వాసు, ఎం. శివప్రసాద్, మజ్జి పద్మ, ఎంపీపీ ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు నారాయణ గౌడ్, కన్ స్ట్రక్షన్ ఏజెన్సీ నిర్వాహకుడు గాలి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link