అత్తిలి ఎంపీపీ కూటమి జెండా ఎగరవేస్తాం

రాబోయే రోజుల్లో కూటమిలోకి మరికొందరు

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

కూటమికి జై కొట్టిన ఇద్దరు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు

అత్తిలి మండల ప్రజాపరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి జెండా ఎగిరి తీరుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో అధికార మదంతో కారుమూరి చేసిన దౌర్జన్యాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అత్తిలి మండలానికి చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీటీసీ సభ్యులతోపాటు మరికొందరు ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వీరికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఇటీవల వైసీపీ ఎంపీటీసీ సభ్యులను అడ్డగించామని, మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు నివాసంపై దాడి చేశామని అసత్యాలు పలికి తన ట్రేడ్‌ మార్కు అయిన అబద్ధాలు రుజువయ్యాయని అన్నారు. మాకు మద్దతు తెలియజేసే ఎంపీటీసీ సభ్యులను శిబిరాలు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిప్పి, ఇళ్లల్లో పెట్టి తాళాలు వేసి నిర్భంధించారని చెప్పారు. ఆరోజు కారుమూరి చేసిన విధానాలతో విసుగెత్తిపోయిన అత్తిలి మండలంలోని ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, దేశ ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిపై నమ్మకంతో స్కిన్నెరపురం ఎంపీటీసీ సభ్యులు కూరాకుల లక్ష్మి, ఉరదాళ్లపాలెం ఎంపీటీసీ సభ్యులు గుండుమోగుల శ్రీనివాస్‌లు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో గత నాలుగేళ్లలో వారి పరిధిలో జరగని అభివృద్ధి వచ్చే ఏడాదిలో పూర్తి చేసి గ్రామ ప్రజలకు కానుకగా ఇవ్వాలని కోరారు. గతంలో ఉరదాళ్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాని చెప్పిన మాజీ మంత్రి కారుమూరి గ్రామ అభివృద్ధిని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరికొందరు ఎంపీటీసీ సభ్యులు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అత్తిలి ఏఎంసీ ఛైర్మన్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ దాసం బాబ్జి, అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, అత్తిలి మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link