ప్లాస్టిక్ నిషేధంపై ఉద్యమం చేపట్టాలని పిలుపు
గ్రామాల్లో స్వచ్ఛత సాధించేందుకు కృషి చేయాలి
‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర’ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు, అత్తిలి పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహణ
రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రకు రాష్ట్రంలోనే తణుకు పట్టణం తొలిమెట్టు కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ – 2047 లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. తణుకు ఇరగవరం కాలనీలో 12, 13 వార్డుల్లో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో కింది నుంచి పైస్థాయి వరకు పారిశుద్ధ్యం, ఈ వేస్ట్ అమలు చేసి గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రతి నెల మూడో ఆదివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మూడో శనివారం ప్రత్యేకంగా ఒక థీమ్ అమల్లోకి తీసుకుని ప్రజలను భాగస్వామ్యం చేసేవిధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల తణుకు పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో ఈ వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్వీర్యం చేసుకునే విధంగా ప్రతిఒక్కరిలో అవగాహన రావాలన్నారు. పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపల్ కార్యాలయం లేదా సచివాలయంలో అందజేయడం ద్వారా నగదును పొందవచ్చని చెప్పారు. రెడ్యూస్–రీసైకిల్–రీయూజ్ విధానం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ప్రతిఒక్కరు సహకరించాలన్నారు. ఇళ్లలో చెత్తను రోడ్లుపై వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఇంటింటికీ వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందజేసి సహకరించాలని కోరారు. ఒకో క థీమ్ ద్వారా తణుకు పట్టణంలోని పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తణుకు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చి దిద్దేందుకు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగంపై అవసరమైతే జరిమానాలు విధించి ఉద్యమంగా తీసికెళ్లి క్లీన్ అండ్ గ్రీన్ తణుకు పట్టణంగా తీర్చి దిద్దాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. అనంతరం అత్తిలి పట్టణంలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తిలి కూడలిలో మానవహారం చేపట్టి పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


