ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 13 ప్రాంగణంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ కందుకూరి జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటారని అభ్యుదయ ఆదర్శకరం వీరేశలింగం అని అన్నారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు ఆదూరి రాజరాజేశ్వరి మాట్లాడుతూ ఆధ్యుడు ఆరాధ్యుడు ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడు కందుకూరి అన్నారు. ముఖ్యఅతిథి విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు అక్కిపెద్ది రామ సూర్యనారాయణ మాట్లాడుతూ సాంఘిక దురాచారాలను ప్రతిఘటించి సాహిత్య రంగంలో గొప్ప కృషి చేశారని తొలి నాటక కర్త దర్శకుడు ప్రదర్శన కారుడు కందుకూరి అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించి బహుమతులను నిర్వాహకులు అందజేశారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు అక్కిపెద్ద రామ సూర్యనారాయణ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహితీ సామ్రాజ్యం సభ్యులు ముక్కామల మోహనరావు, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, కోలా లావణ్య, మారుతి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


