24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ
వైసీపీ ప్రభుత్వ హయాంలో తరుగు పేరుతో దోపిడీ
గతంలో ఆరు నెలలకు సైతం రైతులకు జమ కాని నగదు
తణుకు నియోజకవర్గంలో లక్ష టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
దువ్వ, వేల్పూరు గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
రైతులు తాము విక్రయించుకున్న ధాన్యానికి సంబంధించి 24 గంటలు వ్యవధిలోనే డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం తణుకు మండలం దువ్వ, వేల్పూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో 53 రైతు సేవ కేంద్రాల ద్వారా దాదాపు లక్ష టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. రబీ సీజన్ కు సంబంధించి జిల్లాలో ఆరు లక్షల టన్నులు, తణుకు నియోజవర్గంలో లక్ష టన్నులు చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. రైతులు తమకు నచ్చిన ప్రాంతాల్లో ఏ రైస్ మిల్లుకు కావలిస్తే ఆ రైస్ మిల్లుకు అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు లోడింగ్, అన్ లోడింగ్ హమాలీ చార్జీలు సైతం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గోనె సంచులు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ధాన్యం విక్రయించుకున్న ఆరు నెలలకు సైతం డబ్బులు వారి ఖాతాల్లో జమ కాని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. పరుగులు పేరుతో గత ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు కనీసం గోన సంచల సైతం ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. స్థానికంగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉన్నప్పటికీ తణుకు నియోజకవర్గంలో సకాలంలో రైతులకు గోనె సంచులు ఇవ్వకపోవడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి ఉండేదని మరవైపు ధాన్యం విక్రయించుకునే సమయంలో తరుగు పేరుతో బస్తాకు 4 నుంచి 12 కిలోలు చొప్పున దోపిడి చేశారని ఆరోపించారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం ధాన్యం సేకరణలో పారదర్శకంగా వ్యవహరిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రూ. 1600 కోట్లు బకాయిలు ఉంచితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం బకాయిలు చెల్లించిందని చెప్పారు. గత ఖరీఫ్ సీజన్లో సైతం దాన్యం విక్రయించుకున్న 24 గంటల్లోనే వారి ఖాతాల డబ్బులు జమ చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని అన్నారు. రాబోయే రోజుల్లో అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 20 వేలు చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుకు వెళుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


