వ్యవసాయంలో రైతులను శాస్త్రవేత్తలు చేయడమే పొలంబడి కార్యక్రమం ఉద్దేశం అని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేలైన వ్యవసాయ సాగు పద్ధతులు ద్వారా రైతులు ఆదాయం పెంచుకోవడానికి ప్రతి వారం సలహాలు సూచనలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. తాడిపర్రు గ్రామంలో నిర్వహించిన ఇండి-గ్యాప్ పొలంబడి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సీజన్లో విత్తనం వేసినప్పుడు నుంచి కోత కోసేంతవరకు అనగా 14 వారాలు 30 మంది రైతులను ఎంపిక చేసి ప్రతి వారం వారికి సాగులో నూతన విధానాలను వివరిస్తూ కొన్ని కొన్ని ప్రదర్శనలు నిర్వహిస్తూ రైతులు అవసరం మేర ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తూ ఖర్చును సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ నికర ఆదాయాన్ని పెంచేలా వారికి చేదోడు వాదోడుగా ఉండటం అనేది పొలంబడి యొక్క ప్రాథమిక లక్ష్యం తెలిపారు. పొలంబడిలో ముఖ్యంగా నాలుగు సూత్రాలు ఉన్నాయని వాటిలో ఆరోగ్యవంతమైన నారును పెంచడం, మిత్ర పురుగులను సంరక్షించుకోవడం,ప్రతిరోజు పొలం పరిసరాలను విశ్లేషించడం, రైతును తన పొలంలో తనని శాస్త్రవేత్తగా రూపొందించడం అని తెలిపారు.ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్స్ పరీక్షను నిర్వహించారు .అంటే రైతులకు వ్యవసాయంలో కొన్ని అంశాల మీద ఏ మేరకు అవగాహన ఉంది అనేది తెలియడం కోసం ఈ పరీక్షను నిర్వహించినట్లు ఏ . ఓ. వివరించారు.రైతులు ఎరువులు, పురుగు మందులు l,విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని ముఖ్యంగా ఎరువులు కొనుగోలు చేసే సమయంలో బయోమెట్రిక్ వేసి తీసుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగుల బెడుతున్నారుఅని అలా చేయడమా వల్ల భూసారం తగ్గడం తో బాటు, పర్యావరణ కాలుష్యం ఏర్పడటం తో బాటు చాలా పోషకాలు నష్ట పోతున్నాము అని తెలియజేస్తూ కోత పూర్తి అయ్యాక ఒక్కసారి దున్ని సూపర్ ఫాస్ఫేట్ ను ఎకరాకు 100 కేజీలు వేసినట్లయితే ఆ వరి గడ్డి, మోడు త్వరగా కుళ్లి మంచి సేంద్రియ పదార్థాలు నేలకు చేరుతాయి అని తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గించవచ్చు అని సూచించారు. మనిషికి టీకా ఎంత అవసరమో పంటకు విత్తన శుద్ధి అంతే అవసరమని రైతు మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని చేసుకున్నటువంటి విత్తనాలను తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసిన పిమ్మట మాత్రమే వాడుకోవాలని తద్వారా విత్తనాల ద్వారా సంక్రమించేటటువంటి పలు రకాల పురుగులు మరియు తెగుళ్ల భారి నుండి పంటను రక్షించుకోవచ్చని తద్వారా అతి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి ముప్పు లేకుండా ఆరోగ్యవంతమైన దిగుబడి పొందచ్చని సూచించారు. అలాగే విత్తన శుద్ధి తరువాత విత్తన మొలక శాతం కూడా పరిపాటి అని 75% కంటే ఎక్కువ మొలక శాతం వచ్చినప్పుడు మాత్రమే ఆ విత్తనాలను నారు మడిలో వెదజల్లుకోవాలని తెలిపారు. నీటి పరీక్ష ఆవశ్యత, మట్టి నమూనాల సేకరణ, వాటి ఫలితాలను బట్టి ఎరువుల వినియోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తాడిపర్రు సొసైటీ అధ్యక్షులు దుర్గా బాల కృష్ణ, పెండ్యాల గోవింద్, అక్కిన గోపాల కృష్ణ, అక్కిన సుధీర్, రైతులు మరియు వ్యవసాయ, ఉద్యాన సహాయకులు దీప్తి పాల్గొన్నారు.



