రూ.40.32 లక్షల నిధులతో నిడదవోలు నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్ అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్

సమాజంలో పేదరికాన్ని జయించి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి చదువు ఒక్కటే ఏకైక మార్గమని భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడే స్పష్టం చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం పెరవలి మండలం కానూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కానూరు, ఉండ్రాజవరం, ఖండవల్లి, సమిశ్రగూడెం తదితర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు టవల్స్, నైట్ డ్రస్సులు, స్వెటర్లు, దుప్పట్లు, బెడ్ షీట్లు, ప్లేట్లు, గ్లాసులు మరియు మెటీరియల్ కిట్లను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనితీరు, మౌలిక వసతులపై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ .. ఆర్థిక లేమి కారణంగా వెనుకబడిన, దళిత వర్గాల పిల్లలు అవకాశాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోందన్నారు. సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ప్రత్యేకంగా చర్చించి నియోజకవర్గ పరిధిలోని హాస్టళ్ల అభివృద్ధికి రూ.40.32 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు.అందులో భాగంగా సమిశ్రగూడెం ఎస్సీ హాస్టల్ కు రూ.22.15 లక్షలు, కానూరు ఎస్సీ హాస్టల్ కు రూ.12 లక్షలు, ఖండవల్లి ఎస్సీ బాయ్స్ హాస్టల్ (ప్రీమెట్రిక్)కు రూ. 6.17 లక్షలు మంజూరు చేయించానన్నారు. ఈ నిధులతో వసతి గృహాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన, మరమ్మత్తులు చేపడుతున్నామని వివరించారు. అలాగే స్థానిక దళిత యూత్, మహిళలు కోరిన విధంగా నూతన భవనాల నిర్మాణాలు, లీకేజీల నివారణ, కొత్త హాస్టళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆత్మన్యూనతా భావానికి గురికాకుండా, బలమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. 

Scroll to Top
Share via
Copy link