హోం మంత్రి అనితకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
తణుకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ధ్వజం
రాష్ట్ర హోం మంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తణుకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు మహిళలు తీవ్రస్థాయంలో ధ్వజమెత్తారు. పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అయేషాఖాన్ మాట్లాడుతూ మహిళలను కించపర్చుతూ మంత్రి అనితను ఉద్దేశించిన అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన కనీసం ఒక్కరోజైనా తన శాఖకు సంబంధించి మాట్లాడకపోగా కోడిగుడ్డు, గుడ్డు అంటూ మాట్లాడారని గుర్తు చేశారు. కనీసం మహిళల కోసం ఎలా మట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చెందిన కారును అధికారంలోకి ఎవరు వచ్చినా వినియోగిస్తారని అయితే ఈ విషయం తెలియని ఆయన తాను వాడి వదిలేసిన వాహనాన్ని వాడుతున్నారంటూ అవగాహన రాహిత్యంతో చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాసొమ్ములతో ప్యాలెస్‌లు నిర్మించారని మండిపడ్డారు. రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి నాయకురాలు తమరాపు రమణమ్మ మాట్లాడుతూ మంత్రి అనిత వేసుకున్న మేకప్ గురించి వ్యంగ్యంగా మాట్లాడిన అమర్నాథ్ రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారనే విషయం మర్చిపోయిన ఆయన ఇలా మాట్లాడ్డం సరికాదన్నారు. తణుకు పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ పుప్పాల ఇందిరాదేవి మాట్లాడుతూ పురుషులకు ధీటుగా మహిళ అయ్యిఉండి హోం శాఖను నడిపిస్తున్న అనితను ఉద్దేశించి మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కూటమి మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



