కూటమి ప్రభుత్వంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం
గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
రూ. 1.77 కోట్లుతో విద్యుత్తు లైను నిర్మాణ పనులు ప్రారంభం
దువ్వ నుంచి అత్తిలి వరకు విద్యుత్తు లైను నిర్మాణం
అత్తిలి మండలంలో గలా అని గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం పరిధిలోని దువ్వ 220 కెవి సబ్ స్టేషన్ నుంచి 33కెవి విద్యుత్తు లైను 9.5 కిలోమీటర్ల మేర రూ. 1.77 కోట్లు విలువైన పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తణుకు విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ప్రత్యామ్నాయంగా దువ్వ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్తు సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. కేవలం కూటమి ప్రభుత్వంలోనే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఈ పనులకు ప్రతిపాదనలు చేసినట్లు గుర్తు చేశారు అయితే గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు చేపట్టామని చెప్పారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో నిధులు సమకూర్చి ప్రత్యామ్నాయ విద్యుత్తు లైను నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు వ్యవసాయ అవసరాలతో పాటు గృహ అవసరాలు ఆక్వా చెరువుల అవసరాలు తీర్చే విధంగా ఈ పనులు పరిష్కారం లభిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో 22 నెలల కూటమి పరిపాలనలో అనేక శాశ్వత సమస్యలకు పరిష్కారం తీసుకువచ్చామని చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.50 కోట్లు విలువైన పనులు చేపట్టామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సంబంధించి ఇంటింటికి సోలార్ అందించే రూ. 32 కోట్లు విలువైన పనులు చేపట్టామని పేర్కొన్నారు. గ్రామాల్లో లోఓల్టేజీ సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు చేసి ఇప్పటికే పనులు పూర్తి చేశామని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో గ్రామాల్లో ఎక్కడ లో ఓల్టేజీ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్తిలిలో 220 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నామని ఇందుకు సంబంధించి భూసేకరణ పనులు పనులు పూర్తిచేసుకుని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని గుర్తు చేశారు. మంచిలి గ్రామంలో 33 కెవి సబ్ స్టేషన్ నిర్మించి లో వోల్టేజి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



