ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే ఐదేళ్లు కీలకం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆదివారం తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండేళ్లపాటు కష్టపడిన ఫలితానికి ఇప్పుడు వచ్చిన మార్కులు నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో రాబోయే ఐదేళ్లు ఎంతో కీలకంగా నిలుస్తాయని చెప్పారు. ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ సాధించిన 80 మంది విద్యార్థులు తణుకు పట్టణానికి ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రతి ఆదివారం ఇంటికి వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ నిస్సా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని కొనియాడారు తణుకులో మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తి డాక్టర్ హుస్సేన్ అహ్మద్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి అని ఎమ్మెల్యే అన్నారు. అలాగే 2047 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పెట్టుబడులు పెట్టించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. 22 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. భవిష్యత్తులో 13 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు పెట్టుబడులు వస్తున్నాయని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిస్సా ఫౌండేషన్ చైర్మన్ ఆయేషా ఖాన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link