జిల్లాలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో ఇరగవరం మండలంలో పర్యటించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కంతేరు గ్రామంలో తూకాల్లో సమస్యలపై ధాన్యం పడుతున్న రైతులతో ప్రభుత్వం సంచితో కలిపి 40 కేజీల 600 పట్టమంటుంది ఎన్ని కేజీలు పడుతున్నారని అడిగామన్నారు. పలువురు కౌలురైతులు మాట్లాడుతూ ధాన్యం సంచితో కలిపి 41 కేజీలు పడుతున్నారని తెలిపారన్నారు. కర్రి నాగిరెడ్డి అనే కౌలురైతు 41 కేజీల చొప్పున 560 సార బస్తాలు రెండు ట్రాక్టర్లలో ఇరగవరంలోని వేంకటేశ్వర రైస్ మిల్లుకి తీసుకెళ్ళామని ఇంకా 60 కేజీల ధాన్యం తక్కవచ్చింది తీసుకుని రమన్నారని తెలిపారన్నారు. దీంతో సమస్యను మండల వ్యవసాయ అధికారి ఏఒ దృష్టికి తీసుకెళ్లి ధాన్యం తోలిన కౌలురైతు దగ్గర 560 బస్తాల్లోనూ ప్రభుత్వ నిబంధనలకంటే బస్తాకి 400 గ్రాముల చొప్పున అదనంగా 220 కేజీల ధాన్యం మిల్లుకి వెళ్లిందని తెలిపారు. అయినా రైస్ మిల్లర్ 60 కేజీల ధాన్యం తరుగు చూపించి రైతుని తెమ్మనడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ధాన్యం తూకాల ద్వారా జరుగుతున్న మిల్లర్లు, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ ఏఒ రాఘవేంద్రరావు మాట్లాడుతూ తక్షణం మిల్లర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారన్నారు.
ఈకార్యక్రమంలో కౌలురైతులు, రైతులు జి.భాస్కర్ రెడ్డి, కె.రమేష్ రెడ్డి, జోషప్,నాగేశ్వరావు, పెద్దిలు,అంజియ్య తదితరులు పాల్గొన్నారు.


